- 20 వరకు పంచాయతీల్లో వారోత్సవాలు
- ప్రగతి పథంలో రాష్ట్ర పల్లెలు.. అజెండాగా కార్యాచరణ
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో సోమవారం నుంచి ‘పల్లె పండుగ’ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ‘పల్లె పండుగ` పంచాయతీ వారోత్సవాల’ పేరుతో ఈ నెల 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పల్లె పండుగతో రాష్ట్ర పల్లెలు ప్రగతి పథంలో పయనించునున్నాయి. గత ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల్లో చేసిన తీర్మానాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించారు. సోమవారం కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగే ‘పల్లె పండుగ’లో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో భాగంగా.. గ్రామాల్లో నివాసముంటున్న కుటుంబాలకు ఏడాదిలో 100 రోజులు వేతన ఉపాధి కల్పించడం, శాశ్వత ఆస్తులు ఏర్పాటు చేసి జీవనోపాధులు మెరుగుపరచడం, రూ.4,500 కోట్లు నిధులతో 30 వేల పనులు చేపట్టటం, 3000 కిలోమీటర్ల మీద సిమెంట్ రోడ్ల నిర్మాణం, 500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాలు, పదివేల ఎకరాలు నీటి సంరక్షణ ట్రెంచుల ఏర్పాటు.. అజెండాగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.