- గత పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసమే మాస్టర్ ప్లాన్ తయారీ
- మార్పులు చేసి ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచుతాం
- ప్రజల సూచనలు స్వీకరించి తుది మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాం
- పురపాలక మంత్రి మంత్రి నారాయణ వెల్లడి
- విశాఖ ఎమ్మెల్యేలతో నగర అభివృద్ధిపై సమీక్ష
అమరావతి (చైతన్యరథం): విశాఖ అభివృద్దికి సంబంధించి నాలుగు నెలల్లోగా మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ తెలిపారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని వైజాగ్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో స్వార్థ ప్రయోజనాల కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని, దానిలో మళ్లీ మార్పులు చేసి ప్రజాభిప్రాయంతో ఫైనల్ ప్లాన్ విడుదల చేస్తామని తెలిపారు. విశాఖపట్నం నగర అభివృద్దితో పాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ సమీక్ష జరిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్, వంశీ కృష్ణ శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు,ఏపీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ పీలా గోవింద్, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ గోపాల్, రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ విశ్వనాథ్, ఇతర అధికారులు హాజరయ్యారు. వైజాగ్ లో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ సమస్యలు, మెట్రో రైల్ ప్రాజెక్ట్, భూముల ఆక్రమణ, తాగునీటి సమస్య, టీడీఆర్ బాండ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి వంటి అంశాలను సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.
ప్రజల అభిప్రాయాలు తీసుకుంటాం
గతంలో అప్పటి పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖ మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి నారాయణ తప్పుబట్టారు. అందులో మార్పులు చేసి మాస్టర్ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని నాలుగు నెలల్లో మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేస్తాం. మాస్టర్ ప్లాన్ అంటే రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని చేయాలి. కొన్ని చోట్ల రోడ్లు వెడల్పు చేయాల్సి ఉంది. మెట్రో రైల్ కూడా మాస్టర్ ప్లాన్‌లో భాగమే. దీనిపై కూడా సమావేశంలో చర్చించాం. 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లై ఓవర్లు ఉన్నాయి. టీడీఆర్ బాండ్లపైనా సమావేశంలో చర్చించాం. టీడీఆర్ బాండ్లపై అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది. అన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ రోడ్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి. దీంతో రోడ్ల విస్తరణ చెయ్యాల్సి ఉంది. తాగు నీటిసమస్య కూడా ఉంది. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. విశాఖ అభివృద్ది కోసం సీఎం చంద్రబాబు ఆదేశాలతో ముందుకెళుతున్నామని మంత్రి నారాయణ తెతిపారు.
అన్ని అంశాలూ చర్చించాం: ఎమ్మెల్యే పల్లా
విశాఖ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి నారాయణ సమక్షంలో సమీక్ష జరిపామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని రోడ్లకు పక్కన చిన్నచిన్న స్థలాలు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. వీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూడమని మంత్రి నారాయణను కోరాము. అధికారులు మారడం వల్ల అనేక సమస్యలు పెండిరగ్‌లో ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని ఎమ్మెల్యే పల్లా తెలిపారు.
ప్రజల అభిప్రాయం తీసురుంటాం: ఎమ్మెల్యే కొణతాల
విశాఖ అభివృద్ధిపై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని అనకాపల్లి ఎమ్మెల్యే కోణతాల రామకృష్ణ తెలిపారు. గతంలో ఇష్టానుసారంగా మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేశారు. ప్రజల అభిప్రాయం తీసుకుని మాస్టర్‌ప్లాన్ మళ్లీ రూపొందించాలని నిర్ణయించాం. నాలుగు నెలల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాం. 22ఏ భూములు, తాగు నీటి సమస్య, బీచ్ కారిడార్ సమస్యలు ఉన్నాయి. అనకాపల్లి, గాజువాకలో చాలా కాలంగా భూ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి మంత్రి నారాయణ అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే కొణతాల చెప్పారు.
లొసుగులు సరిచేయాలి: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
విజన్` 2047పై ఫోకస్ పెట్టినట్టుగానే సీఎం చంద్రబాబు వైజాగ్ అభివృద్ధిపై దృష్టి పెట్టారని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖా చాలా కీలకం. వైజాగ్ మాస్టర్ ప్లాన్ లో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఇవన్నీ సరిచేయాలని మంత్రి నారాయణకు కోరామన్నారు.