- నేరగాళ్లు తెలివిమీరుతున్నారు…
- పోలీస్ శాఖ అప్రమత్తం కావాలి
- జీరో క్రైం లక్ష్యంగా అడుగులేయాలి
- సాంకేతికతే.. పోలీస్‌కు పెద్ద వెపన్
- సీసీటీవీల వినియోగ తీరు భేష్
- ‘శక్తి’ యాప్‌పై మరింత అవగాహన పెంచడి
- శాంతిభద్రతలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): శాంతి భద్రతలపై సమీక్షలో నేరాల నియంత్రణపై పోలీసు శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజెంటేషన్ ఇచ్చింది. టెక్నాలజీ ద్వారా కేసుల పరిష్కారం, నేరగాళ్లను శిక్షించడంలో అనుసరిస్తోన్న విధానాలను అధికారులు వివరించారు. డిజిటల్ అరెస్టులు, కొత్త తరహా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నేరస్థులను గుర్తించే విషయంలో సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. నేరం జరిగిన ప్రాంతంలో సాక్ష్యాలను సేకరించే విషయంలో కొత్త పద్ధతులను అనుసరించాలన్నారు. నేరస్థులు సాక్ష్యాలు దొరక్కుండా చేస్తున్నారని.. విచారణ అధికారులు తెలివిగా వ్యవహరించాలని సీఎం సూచించారు. నేరాలు చేసి పారిపోయేవారు కొందరైతే, నేరాలు చేసి పక్కవారిపై నెట్టేవారు మరికొందరని సీఎం వ్యాఖ్యానించారు. వివేకా హత్య ఒక్కటే నేరాల్లో పెద్ద కేస్ స్టడీ అని, ఈ కేసు విషయంలో ఎదురైన మలుపులు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణ విషయంలో పక్కాగా వ్యవహరించాలన్నారు. నేరస్థుల గుర్తింపు, తక్షణం శిక్ష పడేలా చేయడంలో క్లూస్ టీమ్ కీలక పాత్ర పోషించాలని సీపం ఆదేశించారు.
‘రాష్ట్ర పోలీసు శాఖకు మంచి గుర్తింపు ఉంది. రాష్ట్రంలో జీరో క్రైమ్ లక్ష్యంగా పోలీసు శాఖ వినూత్న ప్రణాళికలతో కార్యాచరణ దిశగా అడుగులేయాలి. ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలి. విస్తృత ప్రజాస్వామ్యంతో సుస్థిర శాంతిభద్రతలకు వీలవుతుంది. కమ్యూనిటీ భాగస్వామ్యంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి’ అని సీఎం సూచించారు. నేరగాళ్లపై పైచేయి సాధించాలంటే ఆధునిక టెక్నాలజీ ఆసరాగా నిరంతర అప్రమత్తతతో వ్యవహరించాలని, భవిష్యత్తులో సైబర్‌క్రైమ్ రూపంలో పెద్ద ముప్పు ఉందంటూ.. ఈ నేపథ్యంలో పటిష్ట ప్రణాళికల రూపకల్పన, కార్యాచరణ అవసరమన్నారు. ఇందుకు పకడ్బంధీ సైబర్ వాల్స్ రూపకల్పన అవసరాన్ని ప్రస్తావించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌తోపాటు చట్టవ్యతిరేక రుణ యాప్‌లు, సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరముందని పేర్కొంటూ.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 75,749 సీసీటీవీలు సేవలందిస్తున్నాయన్నారు. త్వరలో వీటి సంఖ్యను లక్షకు చేర్చేందుకు పోలీసు శాఖ చొరవ చూపుతోందని, కేసుల ఛేదనలో సీసీ ఫుటేజీ బాగా ఉపయోగపడుతుందన్నారు. గత 9 నెలల కాలంలో 1,902 కేసులను సీసీటీవీల ద్వారా ఛేదించడం జరిగిందని వివరిస్తూ.. సీసీటీవీలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు అధికారులు కృషిచేయాలని, ఇందుకు డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించుకోవాలన్నారు. ‘శక్తి యాప్‌కు సంబంధించి 33 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ యాప్‌పై మరింత అవగాహన పెంచాలి. ఇందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.
ప్రజలు సైబర్ మోసాల బారిన పడేందుకు డిజిటల్ లిటరసీ, పూర్ డిజిటల్ హైజీన్ వంటివి మూల కారణాలుగా కనిపిస్తున్న నేపథ్యంలో అవగాహన పెంచడం ముఖ్యం. పోలీసు శాఖ కూడా సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, ఛేదించేందుకు అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. డిజిటల్ అరెస్టు అంటూ విజయనగరం, బాపట్లలో చోటుచేసుకున్న రెండు సంఘటనలు, వాటిని పోలీసు శాఖ విజయవంతంగా ఛేదించిన తీరును ముఖ్యమంత్రి ప్రశంసించారు. అస్త్రం (కృత్రిమ మేధ) అప్లికేషన్ విజయవాడలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో ఎలా ఉపయోగపడుతుందో పోలీసు అధికారులు వివరించగా.. ఈ చొరవను ముఖ్యమంత్రి అభినందించారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపైనా అవగాహన కల్పించి, యువత వాటివైపు వెళ్లకుండా చూడాలన్నారు. ప్రతి జిల్లాలోని డ్రగ్ డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాలను బలోపేతం చేయాలని, అందుకు సలహా కమిటీలు చొరవచూపాలన్నారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ శాంతిభద్రతలను కాపాడటంలో మంచి పనితీరు కనబరుస్తున్న పోలీసు శాఖను సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.