- షాయాజీ షిండే ఆలోచనను స్వాగతిస్తున్నా
- రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అమలుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తా
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి
- క్యాంపు కార్యాలయంలో పవన్‌తో షాయాజీ షిండే భేటీ
అమరావతి(చైతన్యరథం): ఆలయాల్లో భక్తులకు ప్రసాదంతోపాటు ఒక మొక్క కూడా ఇస్తే పచ్చదనాన్ని పెంపొందించవచ్చునని ప్రముఖ నటుడు షాయాజీ షిండే చేసిన సూచనను స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది అభినందనీయమైన ఆలోచన అన్నారు. షాయాజీ షిండే సూచన అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని చెప్పారు. మంగళవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో షాయాజీ షిండే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన ఆలోచనలు పంచుకున్నారు. ఈ విధంగా వృక్ష ప్రసాద్ యోజనను మహారాష్ట్రలో మూడు ప్రముఖ ఆలయాల్లో అమలు చేస్తున్నారని షిండే తెలిపారు. ఈ సందర్భంగా మొక్కలు, వాటి విశిష్టత గురించి మరాఠీలో రాసుకున్న కవితను పవన్ కళ్యాణ్‌కి చదివి వినిపించారు. ఆ కవితను పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తూ ఆ మరాఠీ కవితను తెలుగులో అనువదించి చెప్పడం విశేషం.
ఈ సందర్భంగా షాయాజీ షిండే మాట్లాడుతూ మనిషి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. ప్రపంచంలో ఏ మత ధర్మం అయినా ప్రకృతిని సంరక్షించుకుంటేనే భవిష్యత్తు అని బోధిస్తోంది. వచ్చే తరాలకు సుందరమైన, కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించాలంటే నేటి తరానికి చిన్ననాటి నుంచే మొక్కల విశిష్టతను తెలపాల్సిన అవసరం ఉంది. దీని కోసం ఆలయాలకు పూజల నిమిత్తం వచ్చే భక్తులకు ప్రసాదంతోపాటు మొక్కలను అందించి వాటిని పెంచేలా ప్రోత్సహించాలి. ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. మహారాష్ట్రలో సిద్ధి వినాయక ఆలయం, దగదుశేథ్ గణపతి ఆలయం, మహాలక్ష్మి ఆలయాల్లో వృక్ష ప్రసాద్ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. విరివిగా మొక్కలను నాటడం నా జీవన అలవాట్లలో భాగం అయ్యింది. నా తల్లి కన్ను మూసినప్పుడు ఆమె బరువుకు సరితూగే విత్తనాలను చాలా ప్రాంతాల్లో నాటాను. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌తో పంచుకున్నారు. దేవాలయాలకు వెళ్లే భక్తులకు ప్రసాదాలతోపాటు మొక్కలను దేవుడు ఇచ్చిన బహుమతిగా అందిస్తే వాటిని నాటడం, సంరక్షించడం దైవ కార్యంగా భావిస్తారు. ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావి తరాలకు మేలు కలుగుతుందని షిండే అన్నారు.