- లైన్ డిపార్ట్‌మెంట్లు సమన్వయంతో వ్యవహరించాలి
- సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి
- అవసరమైనచోట్ల డ్రోన్లను ఉపయోగించాలి
- అవసరమైనమేర నిధులు ఇచ్చేందుకు సర్కారు సిద్ధం
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన
అమరావతి (చైతన్య రథం): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తగినంత మొత్తంలో నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారంనాటి జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అంశంపై మాట్లాడుతూ.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దోమల ద్వారా సంక్రమించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో యాంటీ లార్వల్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించాలన్నారు. మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగిస్తూ పిచికారి చేయించాలన్నారు. మానవ తప్పిదాలవల్ల ఈ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున మున్సిపాలిటీ మరియు పంచాయతీరాజ్ శాఖలు ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడ ఎటువంటి కేసు ప్రబలినా, ఆ కేసుపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
తాగునీరు కలుషితం ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తాగునీరు కలుషితం కాకుండా తగు ముందస్తు చర్యలను చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల బోర్లు ఉన్నాయని, వాటన్నిటిని ముందుగానే ఫ్లష్ అవుట్ చేయించాలన్నారు. అయినప్పటికీ త్రాగునీరు కలుషితానికి అవకాశం ఉంటే, ఆయా బోర్లను వెంటనే తొలగించి వాటి స్థానంలో నూతన బోర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా నీరు కలుషితం కావడానికి వీల్లేదని, ఇందుకై ప్రోటోకాల్ ప్రకారం ఎస్‌ఓపీని పటిష్టంగా అమలుపరచాలని ఆదేశించారు.
అదేవిధంగా త్రాగునీటి పైపుల లీకేజీకి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలని, ప్రత్యేకించి మురుగునీరు, వర్షపు నీటికి త్రాగు నీటి సరఫరా పైపులు ఏమాత్రం ఎక్స్‌పోజ్ కాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్రాగునీటి వనరులన్నిటినీ ముందుగానే క్లోరినేషన్ చేసుకునే అంశంపై మున్సిపాలిటీ మరియు పంచాయతీరాజ్ శాఖలు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిపాలన పరమైన లోపాలవల్లే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అందుకు ఏమాత్రం అవకాశం లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన నిధులను తగినంత మొత్తంలో మంజూరు చేస్తామని, తాగునీరు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లు, సంబంధిత అధికారులపై ఉందన్నారు.
ఆహారం కూడా కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని, ఇందుకు వ్యవసాయ, పౌరసరాలు, ఆరోగ్య శాఖల మంత్రుల బృందం ఈ అంశాన్ని ఇప్పటికే పర్యవేక్షిస్తున్నదన్నారు. సురక్షితమైన ఆహార సరఫరా అంశాన్ని కూడా ఈ బృందమే పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మూడు నెలలపాటు వడదెబ్బకు ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఉన్నందున, ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సాటించాలన్నారు. చల్లని నీటిని సరఫరా చేసే చలివేంద్రాలను పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని, అవసరమైనచోట ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను, మజ్జిగ ప్యాకెట్లు కూడా సరఫరా చేయాలన్నారు. బహిరంగ మలవిసర్జన ఏమాత్రం లేకుండా, వ్యక్తిగత టాయిలెట్లు ఉపయోగించుకునేలా చైతన్య పరచాలని, అవసరమైనచోట్ల వ్యక్తిగత టాయిలెట్స్‌ను వెంటనే మంజూరు చేసి వాటి నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సిఎస్ ఎమ్‌టి కృష్ణబాబు మాట్లాడుతూ శాఖాపరంగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.