- సమగ్ర భూరక్ష చట్టంపై పవన్ విమర్శ
- న్యాయవాదుల పోరాటానికి అండగా ఉంటామని హామీ
మంగళగిరి: విశాఖలో దోచుకున్న ఆస్తులకు చట్టబద్ధత కల్పించుకునేందుకే సమగ్ర భూరక్ష చట్టం తీసుకొచ్చారా అని వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. గుంటూరు, విజయవాడ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. సమగ్ర భూరక్ష చట్టంలో లోపాలపై న్యాయవాదులతో పవన్ చర్చించారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూహక్కుల చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పవన్ కళ్యాణ్ కు న్యాయవాదులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల పోరాటానికి మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ ప్రకటించారు. న్యాయవాదులతో సమావేశం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. సమగ్ర భూరక్ష చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. నా భూమిపై నీకు హక్కేంటి అనేది ఇక్కడి సమస్య. ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ చట్టం ద్వారా రెవెన్యూ అధికారుల సాయంతో ఆస్తులు దోచుకోవచ్చు? కోర్టు నుంచి న్యాయరక్షణ పొందే అవకాశాన్ని ఈ చట్టంలో లేకుండా చేశారు. విశాఖలో దోచుకున్న ఆస్తులకు చట్టబద్ధం చేసుకునేందుకే ఈ చట్టం తీసుకొచ్చారా. ఈ చట్టం వల్ల రుషికొండను దోచుకొని నచ్చిన వారికి రాసుకోవచ్చు. సమగ్ర భూరక్ష చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ చట్టంలో కోర్టుల మధ్యవర్తిత్వాన్ని తీసేశారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తుంది. ఈ చట్టాన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. దేశంలో ఉన్న ప్రతిపౌరుడు రాజ్యాంగ విరుద్దమైన చట్టాన్ని అడ్డుకోవాలి. రాజకీయాలకు అతీతంగా.. ఏపీ ప్రజలకు హాని కలిగించే చట్టాన్ని బలంగా వివరించాలి. త్వరలో పెద్ద సభలా పెట్టి.. ప్రజల్లోకి వైసీపీ దుర్మార్గాన్ని తీసుకెళ్లాలి. న్యాయవాదుల దీక్ష శిబిరాలకు కూడా వచ్చినా వంతుగా మద్దతు ఇస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారసత్వంగా వచ్చే పట్టా పుస్తకాల్లో జగన్ ఫొటో ఎందుకు పెడుతున్నారో అర్థం కావటంలేదు. వారసత్వంగా వచ్చిన భూమిలో జగన్ ముఖచిత్రంతో రాయి ఏమిటి. నేను ఇచ్చేవాడిని.. మీరు తీసుకునేవాడిని.. అందరూ లోబడి ఉండాలనే మైండ్ సెట్ జగన్ ది. రాజ్యాంగ బద్ధంగా ఆలోచన చేసే వారు ఎవరూ ఇలాంటి పనులు చేయరు. భూహక్కు చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ముందుగానే అందులోని అంశాలను అమలు చేసేస్తున్నారు. ఎవరి ఆస్తులు అయినా.. వారి కబంధ హస్తాల్లో పెట్టుకునేలా చట్టం చేశారు. నేను ఈ విషయం విన్నప్పుడు న్యాయవాదులు తమ కేసులు పోతాయనే భమంతో ఆందోళనలు చేస్తున్నారని ప్రచారం చేశారు. గతంలో ఇసుక సమస్య సమయంలో కూడా కార్మికుల పొట్ట కొట్టి వారిపైనే దుష్ప్రచారం చేశారు. న్యాయవ్యవస్థను అతిక్రమించి రెవిన్యూకు హక్కును ఎలా కట్టబెడతారు. ఆస్తులను దోచేయడం సులభతరం అవుతుందనే ఈ చట్టం తెచ్చారని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ చట్టం కారణంగా భూహక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల నుంచి న్యాయవాదుల వరకు ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. ఈ చట్టంపై ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు సంపూర్ణ మద్దతు ఇస్తా. సగటు మనిషికి సులువుగా అర్థమయ్యేలా ఈ చట్టంపై మరింత అధ్యయనం చేస్తా. అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు నాకు కాస్త సమయం కావాలని పవన్ పేర్కొన్నారు.
ఐదుగురు వ్యక్తులు కమిటీగా ఏర్పడితే తొలుత ఈ చట్టం వల్ల కలిగే నష్టాలపై చర్చిస్తాను. ఆ తర్వాత పెద్ద సమావేశం పెట్టి అందరికీ వివరించేలా ముందుకు వెళదాం. ఇది కచ్చితంగా రాజ్యాంగ విరుద్దమైన చట్టం, ప్రాధమిక హక్కులను ఉల్లంఘించే చట్టం. మరోసారి అందరం కలిసి చర్చించుకుని.. కార్యాచరణ సిద్దం చేద్దాం. జనసేన పక్షాన న్యాయవాదుల ఆందోళనకు మద్దతు ఇస్తానని పవన్ చెప్పారు.