- బీసీ డిక్లరేషన్ ప్రకటించాం
- జగన్‌రెడ్డిది సామాజిక ద్రోహం
- రజకులను ఎస్సీల్లో, వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి
- బీసీలను నాయకత్వ స్థానాల్లోకి తీసుకువస్తాం
- టీడీపీ`జనసేన పొత్తుతో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు
- బీసీ జయహో సభలో చంద్రబాబు
అమరావతి, చైతన్యరథం: బీసీల్లోని 153 కులాలకు న్యాయం చేస్తామని, వారిని నాయకత్వస్థానాల్లోకి తీసుకువస్తామని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బీసీల దిశ, దశ మార్చి, పార్టీకి 40 ఏళ్లుగా అండగా ఉన్న వెనుకబడిన వర్గాల రుణం తీర్చుకునేందుకే బీసీ డిక్లరేషన్ ప్రకటిం చామని చెప్పారు. రజకులను ఎస్‌సిల్లో, వడ్డెర్లను ఎస్‌టిల్లో చేర్చేందుకు కృషి చేస్తామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. బీసీలను పెంచిన పార్టీ టీడీపీ కాగా…బీసీలపై గొడ్డలి వేటు వేసిన పార్టీ వైసీపీ అని అన్నారు. టీడీపీ`జనసేన పొత్తుతో వైసీపీ నేతల్లో వణుకు ప్రారంభమైందని, ఇప్పటి వరకు జరిగిన మూడు సభల్లో రెండు పార్టీల మధ్య నెలకొన్న ఐక్యత చూసి వైసీపీకి ఓటమి ఖాయమైపోయిందని, మరో మూడు ఉమ్మడి సభల తర్వాత వైసీపీ అడ్రసు గల్లంతౌతుందని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. మంగళవారం నాగార్జున యూనివర్శిటీ వద్ద నిర్వహించిన జయహో బీసీ సభలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి 10సూత్రాలతో కూడిన బీసీ డిక్లరేషన్‌ను విడు దల చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ డిక్లరేషన్‌లో ఉన్న అంశాలను వివరించారు. అధికారం లోకి వచ్చిన వెంటనే ఈ అంశాలను ఖచ్చితంగా అమలుచేస్తామని చెప్పారు.
బీసీలు లేకపోతే నాగరికత లేదు
చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘‘బీసీల్లో ఉన్న 153 కులాలు లేకపోతే నాగరికత లేదు. మీరు లేకపోతే సమాజహితం లేదు. ఈరోజు నాగరికతకు, మన సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నం వెనుకబడిన వర్గాలే. రజకులు బట్టలు ఉతకపోతే మనం ఇంత బాగా కనపడము. అలాంటి రజకులకు ఇబ్బందులు ఉన్నాయి. వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుకుంటున్నారు. తప్పకుండా కేంద్రంపై ఒత్తిడి పెంచి సాధించే వరకు మీకు అండగా ఉంటాం. చెరువులు, దోబీ గాట్లపై మీకు హక్కులు ఉండేవి. ఇస్త్రీ పెట్టెలివ్వడం ఈ ప్రభుత్వం మానేసింది. దోభీ ఘాట్లకు 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తే…దాన్ని కూడా రద్దు చేశారు.
యాదవులు బంజరు భూముల్లో పశువులను మేపుకొనడానికి 559 జీవోను ఇస్తే దానిని నేడు అమలు చేయడం లేదు. వడ్డెర కులస్తులు రాళ్లను కొట్టే వృత్తిగా పెట్టుకొని జీవితాలు సాగిస్తూ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఎస్టీలుగా చేర్చాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. దీని కోసం మేము మద్దతుగా ఉంటాం. మత్య్సకారులకు నష్టం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవోను రద్దు చేస్తాం. చేనేత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారు నేసే వస్త్రాలపైన జీఎస్టీ వేశారు…మన ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ రద్దు చేస్తాం. ప్రతి కులానికి నిధులు కేటాయించి ఆర్థికంగా బలపరిచేందుకు బాధ్యత తీసుకుంటాం. ఈ సభలో ఉన్న ప్రతీ ఒక్కరు ఈ ప్రభుత్వ బాధితులే. అచ్చెన్నాయుడును 80 రోజులు జైల్లో పెట్టారు. ఎక్కడో హత్య జరిగితే కొల్లు రవీంద్రపై హత్యకేసు పెట్టి జైల్లో పెట్టారు. యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు వంటి వారిపై కూడా కేసులు పెట్టారు. బీసీ నాయకుల అందరిపై కేసులు పెట్టారు. నేను, పవన్ కళ్యాణ్ కూడా బాధితులమే. 40 ఏళ్లలో ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేదు. బీసీ నాయకత్వాన్ని పెంచిన పార్టీ టీడీపీ. బీసీ నాయకత్వంపైన గొడ్డలి వేటు వేసిన పార్టీ వైసీపీ.
బీసీలను ఊచకోత కోసిన జగన్ రెడ్డి
బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాంకు కారణం చెప్పకుండా ఎమ్మెల్యే స్థానం నుండి ఎంపీ స్థానానికి మార్చారు. అదే అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన మంత్రి పెద్దిరెడ్డిని మార్చగలవా? వెనుకబడిన వర్గాల్ని ఊచకోతకు కోసినటు వంటి పల్నాడు నాయకులను మార్చగలిగే శక్తి మీకు ఉందా? 18 మంది బీసీ నాయకులను చంపారు.
చంద్రయ్యను చంపేముందు జై జగన్ అను నిన్ను వదలిపెడతామన్నారు…ప్రాణం పోయినా పర్వాలేదు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలొదిడాడు. ఇలాంటివి ఏ విధంగా మరచిపోగలం? నేను చంద్రయ్య పాడి మోశాను. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే టీడీపీ నాయకున్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి దారుణంగా చంపించాడు. ఆ ఎమ్మెల్యేకి సీటు ఎందుకిచ్చారు.? తిరుపతిలో ఒకాయనను పెద్ద ఎత్తున ఎర్రచందనం వ్యాపారం చేశాడు…ఆయన్ను తెచ్చి ఒంగోలు ఎంపీగా పెట్టారు. వీరప్పన్ మాదిరిగా ఈ భాస్కరన్ తయారయ్యాడు.
రాష్ట్రంలో నలుగురు రెడ్లను పెట్టుకొని పెత్తందారీ వ్యవస్థతో రాష్ట్ర రాజ కీయాలు చేసే మీరు, వెనుకబడిన వర్గాలను అణచివేసే మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఈ జగన్ మోహన్ రెడ్డికి లేదు.
సామాజిక న్యాయం కంటే సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్. అందుకే వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో అన్ని విధాలా వెనుకబడిన వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయం గా, సామాజికంగా పైకి తీసుకొస్తాం. బీసీలంటే జగన్ రెడ్డికి పల్లకీలు మోసే బోయీలని అనుకుంటు న్నాడు. కాదని నిరూపించాల్సిన అవసరం వచ్చింది. బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు. బ్యాక్ బోన్ సొసైటి అని నిరూపించడానికే ఈ జయహో బీసీ. వైసీపీ అన్యాయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని చంద్రబాబు అన్నారు.