- స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
- గుండుమలలో స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి
మడకశిర(చైతన్యరథం): సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో చంద్రబాబు చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. వారికి అవసరమైన సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం వెళ్లిన సీఎం చంద్రబాబు గుండుమల గ్రామమంతా కలియతిరిగారు. ‘ఏమమ్మా బాగున్నారా’ అంటూ మహిళలను ఆప్యాయంగా పలకరించారు.
మరోవైపు గ్రామంలోని కరియమ్మ దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా గుండుమల గ్రామస్తులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తొలిసారి శ్రీసత్యసాయి జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు గుండుమలలో కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమంలో భాగంగా ఓబులమ్మ కు వితంతు పెన్షన్, పులమాసి రామన్న కు వృద్ధాప్య పెన్షన్‌ను స్వయంగా సీఎం చంద్రబాబు అందజేశారు. గుండుమల గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
పెన్షన్ సాయంతో.. సంతోషంగా ఉన్నాం
వితంతు పెన్షన్ అందుకున్న ఓబులమ్మ మనోభావం
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకతో.. మా కుటుంబం సంతోషంగా ఉంది. అవ్వ తాతలపై ప్రేమతో పింఛన్ రూ.4వేలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెన్షన్‌తో పాటు.. మా కుటుంబం ఇతర పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతున్నాము. ఏ చీకు, చింత లేకుండా జీవిస్తున్నాం. టీడీపీ ప్రభుత్వంలో..సుభిక్షంగా వుంటామన్న నమ్మకం ఏర్పడిరది. సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వమే కొనసాగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం.
ఓబులమ్మ వివరాలు
షెడ్యూల్ కులం మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓబులమ్మ భర్త పది సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించారు. ఓబులమ్మ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరంతా వివాహమై విడివిడిగా నివసిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమారులు బెంగళూరులోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో సహాయకులుగా పనిచేస్తున్నారు. ఆమె వ్యవసాయ కూలీగా పనిచేస్తూ, చుట్టుపక్కల ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమె ప్రధానంగా ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్ 4000 రూపాయల పైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. 25 ఏళ్ల క్రితం సొంతంగా నిర్మించిన పాత ఇల్లు కూడా పై కప్పు దెబ్బతింది. స్వగ్రామంలోనే తన పిల్లలకు వ్యక్తిగత ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
రూ. 4వేలకు పెన్షన్ పెంచిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
వృద్ధాప్య పెన్షన్ అందుకున్న పులమాసి రామన్న మనోభావం
జులై నుంచి రూ.4,000 పెన్షన్ మొత్తాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ధన్యవాదాలు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల కు పెంచిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఎవరూ పట్టించుకోని మాలాంటి వృద్ధులకు ఈ పింఛన్ ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో నెలనెలా పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ.. పడిగాపులు కాసే వాళ్ళం. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులిస్తుంటే చంద్రన్న పండుగలా వుందని సంతోషం వ్యక్తం చేశారు.
పులమాసి రామన్న వివరాలు
వాల్మీకి బోయ బీసీ సామాజిక వర్గానికి చెందిన 70 ఏళ్ల పులమాసి రామన్న వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నారు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ముగ్గురికి వివాహమై విడివిడిగా నివసిస్తున్నారు. పెద్ద కుమారుడు మారుతి ఎంఏ, బీఈడీ పూర్తి చేసి వాటర్ వర్క్స్ విభాగంలో దినసరి కూలిగా పనిచేస్తున్నాడు. అలాగే ఆయన భార్య కామాక్షి బీఎస్సీ బీఈడీ చదివి ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు ఏడవ తరగతి వరకు చదివి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య పూల వ్యాపారం చేస్తూ కొద్దిగా సంపాదిస్తోంది. వీరి కుటుంబం క్రమం తప్పకుండా సత్సంగ్ భజన కార్యక్రమాలు చేస్తున్నారు. రామన్నకు జీవనోపాధికి ప్రధాన వనరు ప్రభుత్వం నుండి ప్రతినెలా అందుకుంటున్న వృద్ధాప్య ఫించన్ మాత్రమే. రామన్న స్వగ్రామంలో తన పిల్లలకు వ్యక్తిగత ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతోపాటు బీఎస్సీ బీఈడీ చదివిన తన పెద్ద కుమారుడి భార్యకు ఉపాధి కల్పించాలని కోరారు.
పెన్షన్ దారుల కష్టాలు విన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రామన్నకు భూమితో పాటు, వారి బిడ్డలకు ఉపాధి కూడా కల్పిస్తామని, ఓబులమ్మ కు ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం గుండుమల నుంచి బయలు దేరి పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఏం.ఎస్ రాజు, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి, జిల్లా కలెక్టర్ చేతన్, సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి ఆర్డీఓ సౌభాగ్య లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.