హైదరాబాద్ : సైబర్‌టవర్స్ నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ‘తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్’ ఆధ్వర్యంలో ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ జరిగింది. ఈ ఈవెంట్‌లో చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగులు, గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలవారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం విజయవంతం కావటం పట్ల చంద్రబాబు అభిమానులకు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి వేరువేరుగా కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం జనసంద్రమైంది. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు అభిమానుల వెల్లువతో నిండిపోయింది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన అభిమానులు, ఐటీ ఉద్యోగులు జై చంద్రబాబు, సీబీఎన్ జిందాబాద్, మేము సైతం బాబు కోసం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలతో హోరెత్తించారు.
హైదరాబాద్‌లో సైబర్‌టవర్స్ నిర్మించి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఐటీ రంగానికి బీజం మేసిన చంద్రబాబుకు కృతజ్ఞత తెలిపేందుకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్’ పేరిట ఆదివారం సాయంత్రం జీఎంసీ బాలయోగి స్టేడియంలో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన అభిమానులతో స్టేడియం గ్యాలరీలు మొత్తం నిండిపోయాయి. చంద్రబాబు నామస్మరణతో స్టేడియం మార్మోగింది. చంద్రబాబు విజన్, నాయకత్వంపై సినీ దర్శకులు క్రాంతి వలజ రూపొందించిన గీతాన్ని సినీదర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు. హైదరాబాద్, ఐటీ రంగాభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిపై రూపొందించిన వీడియోను కూడా ఆవిష్కరించారు. బెంగళూరు నుంచి వచ్చిన బీట్ గురు బ్యాండ్ సభ్యులు సంగీతంతో అందరినీ ఉర్రూతలూగించారు. సినీ సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్ బృందం చంద్రబాబుపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆలపించి అందరినీ హుషారెత్తించింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, మనవడు చైతన్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఏపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తదితరులు హాజరయ్యారు.