అమరావతి (చైతన్య రథం): అధికారం అండతో గన్నుపెట్టి ఆస్తులు రాయించుకోవడం ఎక్కడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవన్నారు. కొత్త తరహా నేరాలపట్ల చర్యలేంటో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని పేర్కొన్నారు. అవినీతి గురించి విన్నాం కానీ.. వ్యాపారాల్లో వాటాలు లాక్కోవడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. తుపాకీ చూపించి మరీ ఆస్తుల్లో వాటాలు లాక్కోవడం మునుపెన్నడూ లేదన్నారు. ముంబయిలో మాఫియా బృందాలు లాక్కునే ఆస్తులను సీజ్ చేసే చట్టం ఉందని.. ఆ అంశంపై సమాచారం తెప్పించుకుంటామని చెప్పారు. ఆస్తులను పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.