టిడిపి అధికారంలోకి వచ్చాక సత్యపాల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా వడ్డెర్లకు న్యాయం చేస్తాం. వడ్డెర్లకు చంద్రన్న బీమా పథకాన్ని అమలుచేస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం బనగానిపల్లి నియోజకవర్గం అప్పలాపురంలో వడ్డెర సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ఏపీలో దాదాపు 40లక్షల మంది వడ్డెర కులస్తులు ఉన్నారు. గనులు, భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా, ట్యాంకులు, బావులు, ఆనకట్టలు, రైల్వే వంతెనలు, వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు.
1970వరకు వడ్డెరలు ఎస్టీలుగా ఉండేవారు. ఆ తర్వాత బీసీ-ఏ జాబితాలో చేర్చారు. అనంతరామన్ కమిషన్ వడ్డెర విద్యార్థులకు ఉచిత విద్యనందించాలని నివేదిక ఇస్తే దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి. వడ్డెర విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి. వడ్డెరలకు ప్రమాద బీమా కూడా లేదు. బీమా సౌకర్యం కల్పించాలి. 45ఏళ్లు దాటిన వడ్డెరలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వడ్డెర్లతో పాటు బిసిలకు తీరని ద్రోహం చేశారు.
బిసిలకు చెందాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం దారిమళ్లించింది. గత ప్రభుత్వంలో అమలుచేసిన 100 సంక్షేమ పథకాలను జగన్ అధికారంలోకి వచ్చాక దారి మళ్లించారు. గత టిడిపి ప్రభుత్వంలో ఆదరణ పథకం కింద రూ.964 కోట్ల విలువైన పనిముట్లను 90శాతం సబ్సిడీపై బిసిలకు అందించాం. 2018లో మొట్టమొదటిగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.147 కోట్ల రూపాయలు కేటాయించాం. వైసిపి ఎటువంటి నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.