- ప్రతిరోజూ ఇద్దరు మంత్రులు పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలి
- వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి
- సమర్థులకు, కష్టపడ్డవారికే నామినేటెడ్ పదవులు
- వైసీపీ హయాంలో నమోదైన అక్రమ కేసులపై ఆరా
అమరావతి(చైతన్యరథం): అధికారంలోకి వచ్చేశామనే అలసత్వాన్ని నేతలు వీడాలని సీఎం చంద్రబాబు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చేశాం అనే అలసత్వాన్ని నేతలు వీడాలన్నారు. మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ రావటం సేవగా భావించాలన్నారు. ప్రతీ రోజూ ఇద్దరు మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రుల్ని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇన్‌చార్జ్‌లు తీసుకోవాలని సీఎం తెలిపారు.
మంత్రులు బాధ్యత తీసుకోవాలి
ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించి వాటి పరిష్కరించేందుకు మంత్రులంతా బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు, విజ్ఞాపనలు స్వీకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ నేతలు ఎవ్వరూ వ్యక్తిగత దాడులకు, కక్షసాధింపులకు దిగొద్దని స్పష్టం చేశారు. వైసీపీ చేసిన తప్పులే మనం చేస్తే… వారికీ మనకూ తేడా ఉండదన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దామని చంద్రబాబు అన్నారు.
చట్టపరంగానే తేలుద్దాం
గత 5 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులపై ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆరా తీశారు. చట్టపరంగానే వారికి కేసుల నుంచి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై ముఖ్యమంత్రి చర్చించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని ఆదేశించారు. తెలుగుదేశం నేతలు, ఇళ్లు, కార్యాలయాలపై గతంలో వైసీపీ మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని అధికారుల వివరాలు ఇవ్వాలన్నారు. చట్టపరంగానే వారి సంగతి తేలుద్దామని తెలిపారు.
సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారి గురించి ఐదు విధాలుగా సమాచార సేకరణ చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో, పార్లమెంట్ కోఆర్టినేటర్, నియోజకవర్గ పరిశీలకుడితో పాటు ఐవీఆర్‌ఎస్ ద్వారానూ సమాచార సేకరణ చేస్తున్నామన్నానరు. నివేదికలు త్వరగా పంపాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జోనల్ ఇన్‌ఛార్జులు, తదితరులు పాల్గొన్నారు.