- రూ.8003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేయడం రికార్డు
- వైసీపీ పాలన చీకటి రోజుల నుంచి అన్నదాతలకు విముక్తి
- ఖరీఫ్ స్ఫూర్తితో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సిద్ధం
- మీడియాతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి (చైతన్యరథం): ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరింది.. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ (శనివారం) ఉదయానికి రూ.8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోళ్లు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడిరచారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ రైతులను ఏమాత్రం ఇబ్బందిపెట్టకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 34,78,445 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తూకం తేడాలు, తేమ శాతం తేడాలు లేకుండా నిబద్ధతతో ధాన్యం కొనుగోలు చేయడం కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనం అన్నారు. శనివారం సాయంత్రం తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతలు పండిరచిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడేవారన్నారు.
దళారీల ప్రమేయంతో అహర్నిశలు శ్రమ చేసి పండిరచిన పంటను సరైన ధరకు అమ్ముకోలేక ఇక్కట్లకు గురయ్యేవారు. అప్పటి ప్రభుత్వమే ఏ మిల్లర్ కు అమ్మాలో కూడా నిర్ణయించేది. మిల్లుల దగ్గర రాత్రింబవళ్లు వేచి చూసి మరీ రైతులు ధాన్యం అమ్ముకోవలసిన పరిస్థితి ఉండేది. ఎంత చేసినా సరైన మద్దతు ధర రాక తేమ శాతం పేరు చెప్పి అన్నదాతను నిలువునా మోసం చేసేవారు. ఇన్ని ఇబ్బందులు పడి ధాన్యం అమ్మితే ఆ డబ్బులు ఎన్ని నెలలకు వస్తాయో.. అసలు వస్తాయో రావో కూడా తెలియని అయోమయ పరిస్థితి అన్నదాతల్లో ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట అన్నదాతలకు సంబంధించిన సమస్యల మీద దృష్టి పెట్టాం. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరించి, రైతులకు డబ్బులు ఇవ్వకుండా బాకీ పెట్టిన రూ. 1674 కోట్లను నెలలోనే విడుదల చేసాం. అన్నదాతలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అది నిదర్శనం. దాని తర్వాత కూడా అన్నదాతల సమస్యల మీద, వారికి ఎలా మేలు చేయాలి అన్నదానిమీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి మనోహర్ తెలిపారు.
24 గంటల్లో డబ్బులు జమ
గత ప్రభుత్వంలో అన్నదాతలు ఎంతగా మోసపోయారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాన్ని అధిగమించి ఈ ఖరీఫ్ సీజన్లో రూ.8,003 కోట్ల ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా, ధాన్యం డబ్బులను 24 గంటల్లో జమ చేయడం ఓ అరుదైన రికార్డు. ధాన్యం కొనుగోలుపై వైసీపీ వర్గాలు దుష్ప్రచారం చేసినా దాన్ని తిప్పి కొట్టగలిగాం. అన్నదాతలకు ఎక్కడా గోతాల సమస్య, రవాణా సమస్య, తేమ సమస్య లాంటివి లేకుండా పటిష్టంగా ధాన్యాన్ని కొనుగోలు చేయగలిగాం. ధాన్యం కొనుగోలు తీరు మీద వైసీపీ ఎన్ని పన్నాగాలు పన్నినా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఎక్కడా చిన్న పొరపాటుకు తావు లేకుండా, పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేయడం కూటమి ప్రభుత్వ అతిపెద్ద విజయమని మంత్రి మనోహర్ చెప్పారు.
రైతును నిలువునా మోసం చేసిన వైసీపీ
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు విషయంలో వైసీపీకి కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. కూటమి ప్రభుత్వం రైతుకు అన్ని విధాల అండగా ఉండే ప్రభుత్వం. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 4,038 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే, కూటమి ప్రభుత్వంలో 40,009 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇది 746 శాతం అధికం. బాపట్ల జిల్లాలో వైసీపీ హయాంలో 29,164 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తే, కూటమి ప్రభుత్వ హయాంలో 91,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇది 215 శాతం అధికం. పల్నాడు జిల్లాలో వైసీపీ హయాంలో కేవలం 67 మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 13,572 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మొత్తం మీద వైసీపీ ప్రభుత్వ హయాం కంటే కూటమి ప్రభుత్వ హయాంలో 18 శాతం అధికంగా ధాన్యం కొనుగోలు చేయడం ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.5,699 కోట్ల రూపాయల మేర ధాన్యం కొనుగోలు చేస్తే, కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు రూ.8,003 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతుల ఖాతాలో వాటిని జమ చేయడం ఓ అరుదైన విషయం. వ్యవసాయం మీద, రైతుల మీద కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సమయంలో 4.36 లక్షల మంది రైతులు పంటలు వేస్తే, కూటమి ప్రభుత్వ హయాంలో 5.49 లక్షల మంది రైతులు పంటలు వేసుకోవడం కూటమి ప్రభుత్వం మీద రైతులకు ఉన్న నమ్మకాన్ని తెలుపుతోందని మంత్రి మనోహర్ అన్నారు.
నెల్లూరులో అవినీతి అనకొండలు
గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్ళ విషయంలో నెల్లూరు జిల్లాలో భారీ అవినీతి జరిగింది. 2023-24 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఒక్క బస్తా ధాన్యం కూడా అప్పటి ప్రభుత్వం కొనలేదు. దీని వెనుక అతిపెద్ద స్కాం ఉంది. నెల్లూరు జిల్లాలో పౌరసరఫరాల శాఖలో పని చేసే కొందరు సిబ్బంది అత్యంత ఖరీదైన రోలెక్స్ వాచ్ లను, స్కోడా కార్లను కొనుగోలు చేసి విలాసాలు చేశారంటే అక్కడ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ఎంతటి అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రైతులకు చెందాల్సిన డబ్బులు కొందరు దళారులు, అలాగే కొందరు ప్రభుత్వ సిబ్బంది తమ జేబులో వేసుకున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో అతి పెద్ద అవినీతి బాగోతం జరిగింది. కోవిడ్ తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక్క ధాన్యం బస్తా కూడా కొనలేదు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. నెల్లూరు జిల్లా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో 3 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి చురుగ్గా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. మిల్లర్లు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. రైతులు కూడా ఉత్సాహంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. దళారులకు దూరంగా మిల్లర్లు చొరవ తీసుకొని రైతులను ప్రోత్సహించాలని మంత్రి మనోహర్ సూచించారు.
పాఠశాలలకు సన్న బియ్యం
ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన స్ఫూర్తిని అందిపుచ్చుకొని రబీ సీజన్‌కు సిద్ధమవుతున్నాం. ఇదే ఉత్సాహంతో అన్నదాతకు మరింత మేలు జరిగేలా పనిచేస్తాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంలో సన్న బియ్యం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది విద్యార్థులకు ఎంతగానో మేలు చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ప్రతి ప్రజా ప్రతినిధి, మంత్రులు వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసం నిబద్ధతతో పని చేస్తున్నారు. ధరల స్థిరీకరణ మీద, ధరలు తగ్గింపు మీద కూడా దృష్టిపెడతాం. తేమ శాతం, గోతాముల కొరత, రవాణా సమస్యలు లేకుండా చాలా సులభంగా రైతులు ధాన్యం అమ్ముకునే పద్ధతిని రాష్ట్రంలో తీసుకొస్తాం. కూటమి ప్రభుత్వం మొదటి నుంచి రైతు పక్షపాతి గానే పాలన సాగిస్తోంది.. దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగిసామని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు.