టీడీపీ అధికారంలోకి వచ్చాక కెసికెనాల్ నుంచి నాగమ్మ చెరువుకు నీరు అందిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం చింతకుంట్ల గ్రామ రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. నంద్యాల మండలం కానాల గ్రామంలోని నాగమ్మ చెరువు నుండి 40 ఏళ్లుగా తూము ద్వారా హైస్కూల్ కొట్టాల, చింతకుంట్ల, పసురపాడు గ్రామాలకు సాగు,తాగు నీరు అందుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ తూము అనధికారంగా ఉందని చెప్పి కోర్టు ద్వారా మూసివేయించారు. దీంతో 4గ్రామాలకు తాగు, సాగు నీరు లేక ప్రజలు, రైతులు విలవిల్లాడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కెసి కెనాల్ నుండి నాగమ్మ చెరువుకు ఒక తూము ఏర్పాటు చేయాలి. నాగమ్మ చెరువు నుండి తూమును తెరిపించి మా గ్రామాలకు న్యాయం చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా జీవించకూడదన్నది ముఖ్యమంత్రి జగన్ సిద్ధాంతం. లేనిసమస్యలను సృష్టించి వివిధ వర్గాలను ఇబ్బందులు పెట్టి జగన్ రాక్షసానందం పొందుతున్నారు. నాగమ్మ చెరువుపై ఆధారపడిన గ్రామాలకు సాగు, తాగునీరు ఇచ్చి ఆదుకుంటాం అని లోకేష్ హామీ ఇచ్చారు.