- పెద్దమనసుతో సాయం అందించి ఆదుకోండి
- చరిత్రలో కనీవినీ ఎరుగని వరద వచ్చింది
- అప్రమత్తతతో ప్రాణనష్టాన్ని నివారించగలిగాం
- కేంద్రమంత్రి చౌహాన్‌కు మంత్రి నారా లోకేష్ విన్నపం
అమరావతి(చైతన్యరథం): చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి, బుడమేరుకు వరద రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం వరదకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వరద నష్టం వివరాలను కేంద్ర మంత్రికి మంత్రి లోకేష్ నివేదిస్తూ… తీవ్రంగా నష్టపోయిన తమ ప్రజలు తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు పెద్దమనసుతో సాయం అందించాలని కోరారు. వరద సమయంలో ముఖ్యమంత్రి అప్రమత్తతతో వ్యవహరించి ప్రాణనష్టాన్ని నివారించ గలిగారని తెలిపారు. వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి చౌహాన్ కు మంత్రి నారా లోకేష్ గురువారం మధ్యాహ్నం స్వాగతం పలికారు. తర్వాత ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను మంత్రి లోకేష్‌తో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు.
అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి మంత్రి లోకేష్ వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్ వద్ద లాండ్ అయి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వరద వల్ల దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు. గేట్ల మరమ్మత్తుల పనుల వివరాలను కేంద్ర మంత్రికి లోకేష్ తెలియజేసారు. తర్వాత జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్ సింగ్ నగర్, అంబాపురం, విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి లోకేష్‌తో ఎన్డీఆర్‌ఎఫ్ బోటుపై తిరుగుతూ కలిసి కేంద్ర మంత్రి చౌహాన్ పరిశీలించారు. భారీవరద కారణంగా బుడమేరుకు పడిన గండ్లు పూడ్చేందుకు రేయింబవళ్ళు శ్రమిస్తున్నామని లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చౌహాన్ స్పందిస్తూ… వరద కారణంగా జరిగిన నష్టాన్ని త్వరితగతిన భర్తీ చేసేందుకు సాయం అందిస్తామని చెప్పారు.
వరద బాధిత ప్రజలను సాదారణ స్థితికి తెచ్చేందుకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి చౌహాన్ పర్యటనలో లోకేష్‌తో పాటు మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన అనంతరం విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌లో వరద నష్టం వివరాలను కేంద్ర మంత్రి చౌహాన్ కు ముఖ్యమంత్రి వివరించారు. తర్వాత వరదనష్టంపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి చౌహాన్ సమీక్షించారు. జరిగిన నష్టాన్ని కేంద్రమంత్రికి వివరించిన అధికారులు… నష్టంపై నివేదికలు అందజేశారు.