అమరావతి (చైతన్యరథం): వైఎస్సార్ కడప జిల్లా దిద్దేకుంట గ్రామంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. పొలంలోనే భార్యాబిడ్డలతో కలిసి రైతు ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామానికి చెందిన నాగేంద్ర (40) వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడన్నారు. శుక్రవారం రాత్రి తన భార్య వాణి (38), కుమార్తె గాయత్రి (12), కుమారుడు భార్గవ్ (11)తో కలిసి నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. రైతు కుటుంబం ఆత్మహత్యపై జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఇన్చార్జి ఎస్సీ విద్యా సాగర్ నాయుడుతో ఫోన్లో మాట్లాడామన్నారు. తక్షణమే రైతు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారించాలని ఆదేశించామన్నారు. బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని మంత్రి సవిత తెలిపారు.