- మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట
- అడ్డంగా దోచేస్తున్న మంత్రి అప్పలరాజు
- పలాస శంఖారావం సభలో లోకేష్
పలాస: అధికారంలోకి రాగానే జీడిపిక్కలకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఉత్తరాంధ్రను జగన్‌రెడ్డి నిలువునా ముంచేశారన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ విశాఖకు ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదన్నారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలకు భూములు కేటాయించాం. జగన్ మాత్రం విశాఖలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. రైల్వే జోన్ కు భూమి కేటాయించలేదు.
జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పి మాటతప్పారు. పలాస నియోజకవర్గాన్ని రూ.1400 కోట్లతో అభివృద్ధి చేశాం. పలాసలో కొండలను మింగే అనకొండ అప్పలరాజు మంత్రి అడ్డంగా దోచేస్తున్నారు. అప్పల్రాజు ఒక్క పని కూడా చేయలేదు. ఒక్క రోడ్డు వేయలేదు, ఫ్లైఓవర్ పూర్తిచేయలేదు. అహంకారానికి మానవ రూపం అప్పల్రాజు. రైల్ నిలయం పక్కన ఉన్న ఫ్లై ఓవర్ పనులు టీడీపీ హయాంలో ప్రారంభించాం. ఇప్పుడు నిలిపివేశారు.
అప్పలరాజు పేరుకే డాక్టర్. వాస్తవంలో ఆయన మంచి యాక్టర్. ఆయన కొండల రాజు. కొండలు కొండలే తవ్వేస్తున్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మంత్రికి ఒక్కటే చెబుతున్నా.. రెండు నెలలు ఓపిక పట్టు బ్రదర్. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మొత్తం ఎంక్వైరీ వేసి వడ్డీతో సహా కక్కిస్తాం. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలనే మంత్రి వేధిస్తున్నాడు కొండలరాజు. కేపీ రోడ్లు పనులు పూర్తికాలేదు కానీ.. ఆయన కట్టుకున్న ప్రగతి భవన్ పనులు మటుకు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తారు.
పేదవాడు పేదవాడు అంటాడు. రూ.12కోట్ల విలువైన లాడ్జి ఎలా కొన్నాడో ప్రజలకు చెప్పాలని ఈ సభా ముఖంగా అడుగుతున్నా. బర్రెల కొనుగోళ్లలో కూడా కుంభకోణం చేయవచ్చని మంత్రి నిరూపించాడు. బర్రెల కొనుగోళ్లలో రూ.2వేల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేశారు. నువ్వలరేవు గ్రామంలో నగేష్ అనే మత్స్యకారుడు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో తెలియదు. మంత్రి లాలూచీపడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటివరకు కూడా న్యాయం చేయలేదు. పలాస నియోజకవర్గంలో ఐదుగురు మహిళలు ఎలా చనిపోయారో తెలియదు. ఎక్కడ చనిపోయారో తెలియదు. శవాలు దొరికాయి. వారి కుటుంబాలకు న్యాయం చేయలేదు. టీడీపీ- జనసేన ప్రభుత్వం వచ్చాక మొదటి వందరోజుల్లో ఆయా కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. హెల్త్ వర్కర్ పోస్ట్ ఉన్నా, అంగన్ వాడీ పోస్టు ఉన్నా కూడా అమ్ముకునే వ్యక్తి అప్పల్రాజు. చివరికి పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు.
జీడిపిక్కలకు మద్దతు ధర
టీడీపీ హయాంలో 14వేలు ఉన్న జీడి పిక్క.. నేడు 7వేలకు పడిపోయింది. టీడీపీ అధికారంలోకి వస్తే జీడిపిక్క రైతులను ఆదుకుంటాం, మద్దతు ధర కల్పిస్తాం జీడిపక్క పరిశ్రమలను కూడా ఆదుకుంటాం. ఆఫ్ షోర్ ప్రాజెక్టును మొదటి మూడేళ్లలో పూర్తిచేస్తాం. కొబ్బరి, జీడిపప్పు రీసెర్చ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటుచేస్తాం. పలాసలో డిఫెన్స్ ఆర్మీ కోచింగ్ సెంటర్ ను టీడీపీ ఏర్పాటుచేస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు.
పరిశ్రమలు తెస్తాం
ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా సిక్కోలు వాసులు కనిపిస్తారు. మన ప్రాంతానికే పరిశ్రమలు వస్తే మన ప్రాంతం మారిపోతుంది. మత్స్యకారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలలు, బోట్లు, ఐస్ బాక్స్ లు కూడా సబ్సీడీపై ఇవ్వడం లేదు. టీడీపీ అధికారంలోకి వస్తే మత్స్యకారులను గతంలో కంటే రెట్టింపుగా ఆదుకుంటాం. టీడీపీ నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిచేయలేక జగన్ చేతులెత్తేశారు. టీడీపీ వచ్చిన వంద రోజుల్లోనే టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తాం.
రెండునెలలు కష్టపడండి
శంఖారావం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకు వెళ్లాలి. నాలుగు సంవత్సరాల పది నెలలు ఒక ఎత్తు. రెండు నెలలు ఒక ఎత్తు. సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లే బాధ్యత మనపై ఉంది. రాబోయే రెండునెలలు కష్టపడండి… రాబోయే అయిదేళ్లలో కార్యకర్తల బాధ్యత తాన చూసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు.