టిడిపి అధికారంలోకి వచ్చాక తుమ్మల వంక బ్రిడ్జి, వలగొండ నుండి పప్పుల దొడ్డి వరకు రోడ్డు నిర్మాణాన్ని చేపడతాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆలూరు నియోజకవర్గం వలగొండ గ్రామస్తులు లోకేష్ ను తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో తుమ్మల వంకపై వంతెన ఉంది. దీనిపై మేం నిత్యం కర్నూలు, బళ్లారి హైవేపై ఆస్పరి గ్రామాలకు ప్రయాణిస్తుంటాం. పై తరగతులు చదివేందుకు విద్యార్థులు దీనిపైనే ప్రయాణించాల్సి ఉంది. వర్షాలు పడినప్పుడు 3-4 రోజులు ఈ వంక పొంగుతుంది.
ఆ సమయంలో మేం ప్రయాణం చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక తుమ్మల వంక బ్రిడ్జి నిర్మించండి. వలగొండ నుండి పప్పుల దొడ్డి వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. వారి సమస్యల పై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర వహించే మౌలిక సదుపాయాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వైసిపి అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైన్లు, వంతెన నిర్మాణాలు, సాగు, తాగు ప్రాజెక్టులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.