టిడిపి అధికారంలోకి రాగానే అర్బన్ మీ సేవ ఉద్యోగుల సేవలను గతంలో మాదిరి మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కడప రామకృష్ణ కాలేజి వద్ద అర్బన్ మీ సేవ ఉద్యోగులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందించేందుకు 2003లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సేవ వ్యవస్థను ఏర్పాటుచేశారు. కాలక్రమేణా ముఖ్యమంత్రులు మారినా దీనిని మీ సేవగా మార్పుచేసి విజయవంతంగా నడిపారే తప్ప ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు.
2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అధికారంలోకి వచ్చాక మీ-సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకుంటూ, మీ-సేవల్లో పనిచేసే సిబ్బందిని మాత్రం రోడ్డున పడేశారు. మీ సేవ కాంట్రాక్ట్ సిబ్బందికి దాదాపు 12నెలలుగా జీతాలు ఇవ్వకపోగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 171 గవర్నమెంట్ అర్బన్ మీ సేవ కేంద్రాలను ఎటువంటి నోటీసు లేకుండానే స్వాధీనం చేసుకొని మాకు తీవ్ర అన్యాయం చేశారు. మీ సేవల్లో తమకున్న 17సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మా సేవలను ఉపయోగించుకోవాలని మూడేళ్లుగా మంత్రులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు. మానవతా దృక్పథంతో అర్బన్ మీ సేవ ఉద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
మాటతప్పి మడమతిప్పడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో 2014కు ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన కాంట్రాక్టర్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని కొత్త డ్రామా మొదలుపెట్టారు. గత ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానన్న దారుణంగా మోసగించారు. ప్రజలకు మెరుగైన పౌరసేవలందించేందుకు ఉద్దేశించిన మీ సేవ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లతో అర్బన్ మీ సేవ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు టిడిపి మద్దతు ఇస్తుంది అని వారికి హామీ ఇచ్చారు.