- విద్యార్థులకు వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ పిలుపు
- గత ప్రభుత్వంలో దైవాంశ సంభూతుల్లా అన్ని పథకాలకూ వారి పేర్లేనని వ్యంగ్యం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా విధానానికి అనుగుణంగా విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు ఇచ్చారు. విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలపై నేడు చిన్నచూపు ఉందన్నారు. దేశంలో ఇప్పటి ప్రధాని, సీఎంలు, న్యాయమూర్తులు ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారేనన్నారు. అయితే పలు కారణాలవల్ల ఆ తర్వాత ప్రజలు ప్రైవేటు వైపు మళ్లారు, ప్రభుత్వ విద్యకు మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషిచేస్తున్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని ప్రారంభించి 34లక్షలమంది విద్యార్థుల ఆరోగ్య వివరాలను హెల్త్ కార్డుల్లో పొందుపరుస్తున్నాం. రక్తహీనత బారిన పడకుండా ఆర్‌కెఎస్‌కె కార్యక్రమాన్ని ప్రారంభించాం. జూనియర్ కాలేజిల్లో మధ్యాహ్న భోజన పథకం మొదటిసారిగా అమలుగా చేసున్నది ఏపీలో మాత్రమే. ఇందుకోసం ప్రభుత్వం రూ.86 కోట్లు ఖర్చుచేస్తోంది, ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషిచేస్తున్నాం. గత ప్రభుత్వంలో కోడిగుడ్ల సరఫరాలో ఎంతో అవినీతికి పాల్పడ్డారు. గుడ్లపై కూడా స్టాంపు వేసుకున్నారు. వారి పేర్లతో దీవెనలు, కానుకలని పేర్లు పెట్టుకున్నారు. వారి సొంత ఖజానానుంచి ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ వారి పేర్లు పెట్టుకున్నారా? బాధ్యత కలిగిన వారు కనుక ఆ పనులు చేయలేదు. తల్లిదండ్రులు, గురువు, దేవుడికి మాత్రమే దీవెనలు ఇచ్చే అర్హతలు ఉన్నాయి. తాము దైవాంశ సంభూతులమని ఎవరన్నా అనుకుంటే వారిని దూరంగా ఉంచండి. అటువంటి వ్యక్తులు, శక్తులకు దూరంగా పెట్టండి. రాష్ట్రంలో యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ సెన్సస్ చేస్తున్నారు. మీ గురించి ఆలోచించే డైనమిక్ మంత్రి లోకేష్ ఉన్నారు. నైపుణ్య శిక్షణ ఇచ్చి, రాబోయే రోజుల్లో మీ కాళ్లపై మీరే నిలబడేలా కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానం.. రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తుంది. సంపద సృష్టిలో ఏరకంగా భాగస్వాములు కావచ్చో విద్యార్థులు ఆలోచించాలి. కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా విద్యార్థులు తయారుకావాలని మంత్రి సత్యకుమార్ ఉద్బోధించారు.
స్వర్ణాంధ్రసాధన విద్యార్థుల చేతుల్లోనే: ఎంపీ చిన్ని
విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ… మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నివసించే ప్రాంతంలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం హర్షణీయం అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. నేడు ఆయన మనవడు లోకేష్ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ఆనందంగా ఉంది. విద్యాశాఖలో అనూహ్య మార్పులు తెస్తున్న మంత్రి లోకేష్ ు అభినందనలు. ప్రతి ఆరునెలలకు పేరెంట్`టీచర్ మీటింగ్ నిర్వహించడం వల్ల లోటుపాట్లు తెలుస్తాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడం విద్యార్థుల చేతుల్లోనే ఉంది. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే సూత్రాన్ని విద్యార్థులంతా లోకేష్‌ను చూసి నేర్చుకోవాలి. అమెరికా వెళ్లి గూగుల్, టెస్లా వంటి కంపెనీల చుట్టూ తిరిగారు. 20లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా మేమంతా కష్టపడతామని ఎంపీ శివనాథ్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ కళాశాలలకు మహర్దశ: ఎమ్మెల్యే బొండా
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ…ప్రభుత్వ కళాశాలలకు మహర్దశ వస్తోందన్నారు. టెక్స్ట్ బుక్స్, నోట్‌బుక్స్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. మీ భవిష్యత్తు కోసం డొక్కా సీతమ్మపేరుతో మధ్యాహ్న భోజనం ప్రారంభించారు.. మీ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చడానికి కృషిచేయండి. ఈ ప్రభుత్వం మీకోసం పనిచేసే ప్రభుత్వం, చిన్నచిన్న కుటుంబాల నుంచి వచ్చిన మీరు ఉన్నత స్థితికి చేరుకోవడం, కుటుంబ స్థితగతులు మారడం చదువుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం. పేదల విద్య కోసం ప్రభుత్వం వేలకోట్లు ఖర్చుచేస్తోందని బొండా ఉమ తెలిపారు
రాష్ట్ర విద్యచరిత్రలో మైలురాయి
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ…. రాష్ట్ర విద్య చరిత్రలో ఇదొక మైలురాయి, ఈ ప్రయాణంలో నేను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. రాష్ట్రం నాలెడ్జి ఎకానమీకి కేంద్రం కావాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలో విద్యావ్యవస్థ పాఠశాల, ఇంటర్మీడియట్, కళాశాల విద్య కీలక పాత్ర పోషిస్తాయి. విద్యాప్రమాణాలు మెరుగుదలకు విప్లవాత్మక మార్పులు తెస్తున్న మంత్రి లోకేష్‌కు ధన్యవాదాలు. ప్రభుత్వ కళాశాలలకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవారే ఎక్కువగా వస్తారు. విద్యార్థిదశలో ఇంటర్మీడియట్ విద్య ముఖ్యమైన మెట్టు. ప్రైవేటు విద్యకు దీటుగా చేయాలనే ప్రయత్నంలో ఏమాత్రం ఆలోచించకుండా ఆర్థిక భారం ఉన్నా సీఎంతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటర్మీడియట్ వ్యవస్థలో చాలా సవాళ్లు ఉన్నాయి. కొన్ని మార్పులు చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎన్‌రోల్ మెంట్, ఉత్తీర్ణత, మౌలిక వసతులు వంటి సమస్యలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాటన్నింటినీ పరిష్కరిస్తాం. విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులు గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని శశిధర్ ఆకాంక్షించారు.