- కార్యకర్తల కుటుంబాలకు భువనమ్మ భరోసా
- రూ. 3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేత
చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనలో భాగంగా శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఆర్థికసాయం అందించేందుకు భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన ప్రారంభించిన విషయం తెలిసిందే. శుక్రవారం ముగ్గురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. తొలుత చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మోహన్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. మోహన్ నాయుడు గత ఏడాది అక్టోబర్ 14న గుండెపోటుతో మృతిచెందారు.
ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఆయన పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోహన్ నాయుడు పిల్లలు. భువనమ్మకు కృత్ఞతలు తెలిపారు. తరువాత గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్‌ఆర్ పురం మండలం, గంగమ్మగుడి గ్రామంలో పార్టీ కార్యకర్త కరణం ఆంజనేయనాయుడు కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించారు. ఆంజనేయనాయుడు గత ఏడాది అక్టోబర్ 10న గుండెపోటుతో మృతిచెందారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి,
కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. చివరగా సత్యవేడు నియోజకవర్గం, నారాయణవనం మండలం, తుంబూరు గ్రామంలో పార్టీ కార్యకర్త కుమ్మరు మునివేలు కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించారు. మునివేలు గత ఏడాది సెప్టెంబర్ 12న గుండెపోటుతో మృతిచెందారు. ఆయన చిత్రపటానికి భువనమ్మ నివాళులు అర్పించారు. భువనమ్మను చూసి మునివేలు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మునివేలు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను భువనమ్మ ఓదార్చి, దైర్యం చెప్పారు.