- కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ
- రూ. 3 లక్షల చొప్పున ఆర్థికసాయం పత్రాలు అందజేత
ఏలూరు (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణమని పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు ఇబ్బంది వస్తే ఆదుకోవడం తమ కర్తవ్యం అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పి, కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం భువనేశ్వరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యకర్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
పోలవరం నియోజకవర్గం, టి.నరసాపురం మండలం, మక్కినవారిగూడెం గ్రామంలో పార్టీకార్యకర్త అబ్బదాసరి కృష్ణ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం, తాడేపల్లిగూడెం మండలం, కుంచనపల్లి గ్రామంలో పార్టీకార్యకర్త తాడేపల్లి శేఖర్ కుటుంబాన్ని, అదే నియోజకవర్గం పెంటపాడు మండలం, వెస్ట్ విప్పర్రు గ్రామంలో పార్టీకార్యకర్త కోడి అప్పారావు కుటుంబాన్ని, ఉంగుటూరు నియోజకవర్గం, మండల కేంద్రమైన నిడమర్రు గ్రామంలో పార్టీకార్యకర్త గొర్రెల సుబ్బారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.