అమరావతి, చైతన్యరథం: నెల్లూరు జిల్లాకు తయారీరంగ పరిశ్రమలు తీసుకువస్తామని, తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీనిచ్చారు. తాము అధికారంలోకి రాగానే నెల్లూరు నగరానికి మూడేళ్లలో ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ బుధవారం నాడు నెల్లూరు నగరంలోని విఆర్‌సి గ్రౌండ్‌లో యువతతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత సంధించిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఈ కార్యక్రమానికి హాట్ నెట్ సోషల్ మీడియా ఫౌండర్, విశాఖ, హైదరాబాద్ లో 50కిపైగా స్టార్టప్ కంపెనీలు ఏర్పాటుచేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఫోర్బ్స్ 30లో స్థానం సంపాదించిన మోటివేషన్ స్పీకర్ ఫ్రెడ్రిక్ దేవరంపాటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
యాంకర్ ఫ్రెడ్రిక్ : స్టాన్ ఫోర్డ్ లో ఎంబీయే చేసిన అతికొద్ది మంది వ్యక్తుల్లో లోకేష్ గారు ఒకరు. అదొక డ్రీమ్. స్టూడెంట్ గా అక్కడ ఏం నేర్చుకున్నారు? ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, స్టూడెంట్ గా చాలా సరదాలు ఉంటాయి. మీకు సరదాలు ఏమీ లేవా?
నారా లోకేష్ : కాలేజీలో చేసేవన్నీ చేశాం. స్టాన్ ఫోర్డ్ లో చాలా క్రమశిక్షణ ఉంటుంది. ఎంబీయే చేసేప్పుడు పరీక్షలకు ఇన్విజిలేటర్లు ఉండరు. మనం తప్పు చేయకూడదు. ఎవరైనా తప్పు చేస్తే చెప్పాలి. పరీక్షల్లో కాపీ కొట్టడాలు ఉండవు. ఒకే రూమ్ లో 80 మంది పరీక్షలు రాసేవారు. ఒక్కరు కూడా అటూఇటూ చూసేవారు కాదు. అదీ క్రమశిక్షణ. జీవితంలో రాణించాలంటే పట్టుదల, క్రమశిక్షణ అవసరం అని అప్పుడే తెలుసుకున్నా.
యాంకర్ ఫ్రెడ్రిక్ : ఉచిత పథకాల వల్ల శ్రీలంక అవుతుందని చెప్పారు. ఇప్పుడు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు. దీనిని ఎలా చూస్తారు?
నారా లోకేష్ : మన మేనిఫెస్టోలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పన. దీనివల్ల ఎకానమీ రెండిరతలు పెరుగుతుంది. రాష్ట్రానికి ఆదాయం పెరిగితే వనరులు పెరుగుతాయి. కియా ఫ్యాక్టరీ వల్ల అనంత ప్రజల తలసరి ఆదాయం రూ.30వేలకు పెరిగింది. కియా రావడం వల్ల యాక్సిలరీ యూనిట్ లో పనిచేస్తున్నానని, దానివల్ల రూ.30వేల జీతం వస్తోందని ఓ సోదరి నా వద్దకు వచ్చి చెప్పారు. ఆ కుటుంబాన్ని ఆ సోదరే నడిపిస్తోంది. తనకు వచ్చే జీతం ఖర్చు చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమం చేస్తాం. అభివృద్ధి చేసి సంక్షేమం అందిస్తాం. అప్పులతో సంక్షేమం కాదు. జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు 9సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 3సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. చివరకు క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు. సీఎంకు విజన్ ఉండాలి. అప్పులతో సంక్షేమం చేస్తే శ్రీలంక పరిస్థితి మనకు వస్తుంది. మనపై 12 లక్షల కోట్ల అప్పు ఉంది. భూమిపై ఏ ముఖ్యమంత్రీ శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం. వారిపై అప్పుల భారం పడకుండా చూడాలి.
యువకుడు : స్టార్టప్ పరంగా మన రాష్ట్రం అట్టడుగున ఉంది. మీ ప్రభుత్వంలో స్టార్టప్ ల కోసం ఏం చేస్తారు?
నారా లోకేష్- టీడీపీ సహకారంతో నెలకొల్పిన స్టార్టప్ ల వల్ల ఫెడ్రిక్ చాలాబాగా సెటిల్ అయ్యారు. మార్కెట్ లింకేజీ, మెంటర్ షిప్ అందిస్తాం. జగన్ రెడ్డికి దోచుకో, దాచుకో మాత్రమే తెలుసు. జగన్ రెడ్డికి అంత్రోపెన్యూర్ అంటే అర్థం కాలేదు. దీంతో ఆయనను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. సీఎం అవగాహనలేమితో మనం చాలా నష్టపోయాం. మనం స్టార్టప్ ల అభివృద్ధికి అనేక విధాలుగా తోడ్పాటు అందించాం. యువత స్టార్టప్ ల వల్ల అభివృద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటాం. వచ్చే ప్రభుత్వంలో స్టార్టప్ ల కోసం సహకారం అందిస్తాం.
యువతి : పెన్షన్ ఇంటికి రాకపోవడానికి కారణం మీరే అని వైసీపీ అంటోంది. అధికారంలో ఉండి కూడా వైసీపీకి చేతగావడం లేదని మీరంటున్నారు. ఏది నిజం?
నారా లోకేష్ : నిజం గడపదాటే లోపు అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది. వాలంటీర్లను ప్రభుత్వ బాధ్యతల నుంచి ఈసీ దూరం పెట్టింది. అందుకే పెన్షన్ ఇంటికి అందించలేక పోతున్నారు. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ అందించాలని మేం డిమాండ్ చేశాం. అయినా సీఎస్ పట్టించుకోలేదు. నెలరోజులు ఓపికపట్టండి. మీ ఇంటికే పెన్షన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం.
యువకుడు : బాబు గారి అంతటి సౌమ్యుడిని కాదు.. నేను మూర్ఖుడిని అని అంటున్నారు. దీనికేం సమాధానం చెబుతారు.
నారా లోకేష్ : అలా ఎందుకు చెప్పానో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను స్టాన్ ఫోర్డ్ లో ఎంబీయే చేశాను. 2019 ఎన్నికల ముందు నాపై ఒక్క కేసు లేదు. తర్వాత 23 కేసులు పెట్టారు. హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. జగన్ రెడ్డిని ప్రశ్నించిన వారిపై అనేక కేసులు పెట్టి వేధించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగ కేసులు ఎత్తేస్తాం. జగన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ బాధితులయ్యారు. సమాజంలో భయం ఏర్పడిరది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టనని అందుకే చెప్పా. రాజ్యాంగం కొంతమందికి చట్టాలు అమలుచేసే బాధ్యత అప్పగిస్తే.. చట్టాన్ని చుట్టంగా మార్చారు. పవనన్న వాలంటీర్ల గురించి మాట్లాడితే క్రిమినల్ కేసు పెట్టారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి 53 రోజులు జైలులో నిర్బంధించారు. పి.నారాయణను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు.
యువకుడు : నెల్లూరులో ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. స్కిల్ కేసులో చంద్రబాబు గారిపై కేసు పెట్టారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నైపుణ్య కేంద్రాలను మళ్లీ ఏర్పాటుచేస్తారా?
నారా లోకేష్ : చంద్రబాబు గారు ఎక్కడున్నా సింహం సింహమే. చంద్రబాబు గారు ఇప్పటికీ పుస్తకాలు చదువుతారు. ఎప్పటికప్పుడు అన్నీ నేర్చుకుంటారు. యువతకు మంచి ఉద్యోగాలు, నైపుణ్యం కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటుచేయడం జరిగింది. చంద్రబాబు ఏనాడూ తప్పుచేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ముందుకు తీసుకెళ్తాం.
రాము : నెల్లూరుకు సాఫ్ట్ వేర్ పరిశ్రమలు తీసుకువస్తారా?
నారా లోకేష్ : విశాఖలో సాఫ్ట్ వేర్ రంగానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఉంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చా. ఇతర జిల్లాల్లో కూడా అనేక పరిశ్రమలు తీసుకువచ్చా. కృష్ణా జిల్లాకు హెచ్ సీఎల్ వచ్చింది. నెల్లూరుకు మాన్యుఫాక్చరింగ్ జాబ్ లు కూడా తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటా.
యువతి : ప్రభుత్వ మెడికల్ సీట్లు పెంచాలి. పీజీ స్కాలర్ షిప్స్ అందించాలి.
నారా లోకేష్ : జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పీజీ ఫీజూ రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య పథకాలను రద్దు చేశారు. వాటిని మళ్లీ అమలుచేస్తాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లను అమ్ముకుంటున్నారు. మేం వచ్చిన తర్వాత ఫ్రీ సీట్లు చేస్తాం. మొదటి వందరోజుల్లో చేస్తాం.
షేక్ సాదిక్ : మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరుకు ఎయిర్ పోర్ట్ వస్తుందని హామీ ఇచ్చారు. వైసీపీ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు?
నారా లోకేష్ : కర్నూలులో ఎయిర్ పోర్ట్ కట్టింది, విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు. కొత్త టెర్మినల్ కోసం భూసేకరణ చేశాం. తర్వాత జగన్ రెడ్డి నిలిపివేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం చంద్రబాబు కృషి చేశారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. నెల్లూరులో వచ్చే మూడేళ్లలో ఎయిర్ పోర్ట్ పూర్తి చేసి విమానాలు ఎగిరేలా చేస్తాం.
యువకుడు : పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం అమలు చేయాలి.
నారా లోకేష్ : ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఫీజు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మేం వచ్చిన తర్వాత పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం అమలు చేస్తాం.
వెంకటేష్ : 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మన నెల్లూరు నగరంలో నారాయణ ఉన్నప్పుడు డ్రైయిన్లు, పార్క్ లు, టిడ్కో ఇళ్లు అభివృద్ధి చేశారు. 2019లో వైకాపా వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. పైకి మాత్రం అన్నీ చేశామని చెబుతున్నారు. మీరు ఇంత చేసి కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు. లోపం ఎక్కడుంది?
నారా లోకేష్ : నెల్లూరు ప్రజలు బాగా బుల్లెట్ దింపారు. అందుకే బెట్టింగ్ స్టార్ నర్సరావుపేటలో పడ్డారు. ఒకరింటి చెత్త తీసుకుని మరో ఇంట్లో వేస్తే బంగారం అవుతుందా. చెత్త ఎక్కడైనా చెత్తే. తెలుగుదేశం బలహీనత చేసిన పనులు చెప్పుకోలేకపోవడమే. స్కిల్ సెంటర్ల ద్వారా ఇన్ని పనులు చేశామా అని చంద్రబాబు అరెస్ట్ తర్వాత అర్థమైంది. భవిష్యత్ లో చేసే పనులు చెప్పుకుంటాం.
యువకుడు: గతేడాది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగినప్పుడు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పడు ఏపీ మొత్తం నిరుద్యోగమే ఉంది. ఈ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి, అసలు పెట్టుబడులు వచ్చాయా?
నారా లోకేష్ : మనకు కోడిగుడ్డు మంత్రి ఉన్నారు. పెట్టుబడులు గురించి అడిగితే కోడి ముందా, గుడ్డు ముందా అని అంటారు. 13 లక్షల కోట్లు కాదు కదా. 13 రూపాయల పెట్టుబడులు కూడా రాలేదు. ఒక్క గ్లోబల్ కంపెనీ కూడా రాలేదు. ప్రభుత్వం ఇక్కడున్న కంపెనీలను వేధించి పక్క రాష్ట్రాలకు తరిమివేశారు. వచ్చే నెలలో మన బ్రాండ్ సీబీఎన్ వస్తారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కంపెనీలు ఎలా వస్తాయో మీరే చూస్తారు. సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రింగ్ రోడ్డు చంద్రబాబు తీసుకువచ్చారు. నెల్లూరులో 37వేల మందికి ఉద్యోగాలు ఆనాడే కల్పించాం. మళ్లీ పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటాం.
యువకుడు: టీడీపీ ప్రభుత్వంలో దామరచర్లలో ఏర్పాటుచేసిన ఎంఎస్‌ఎంఈ పార్క్ ల ద్వారా 10వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిశ్రమలు తరలివెళ్లాయి. టీడీపీ వచ్చిన తర్వాత పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారా?
నారా లోకేష్ : నెలలో మన ప్రభుత్వం వస్తుంది. గతంలో 35 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఆ పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నెల్లూరుకు కూడా పరిశ్రమలు తీసుకువస్తాం. మన లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల కల్పన. వాటిల్లో ఎంఎస్‌ఎంఈ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసం కృషిచేస్తాం. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం.
యువతి : ఫీజు రీయింబర్స్ మెంట్ అందక చాలామంది నష్టపోయారు. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మాకు నోటిఫికేషన్లు ఏం వస్తున్నాయో కూడా తెలియడం లేదు. 20 లక్షల ఉద్యోగాల్లో ఉపాధి పొందలేని వారికి ఎలాంటి సాయం చేస్తారు?
నారా లోకేష్ : జగన్ రెడ్డి మెగా డీఎస్సీ, 2.30 లక్షల ఉద్యోగాలు, జాబ్ కేలండర్, కానిస్టేబుళ్ల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి మాటతప్పారు. సింగిల్ కేలండర్ ద్వారా ప్రతి ఏడాది అన్ని పోస్టులు ప్రకటిస్తాం. దీనికోసం స్ట్రీమ్ లైన్ పోర్టల్ ఏర్పాటుచేస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ అందక చాలా మంది నష్టపోయారు. దానివల్ల సర్టిఫికెట్లు అందలేదు. 6 లక్షల మందికి సర్టిఫికెట్లు రాలేదు. దీనికోసం వన్ టైం సెటిల్ మెంట్లు చేసి సర్టిఫికెట్లు అందజేస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి అందిస్తాం.
నజమ్ మహ్మద్ : వీఆర్ స్కూల్ కు చరిత్ర ఉంది. ఇప్పుడు మూత పడిరది. తిరిగి ప్రారంభిస్తారా? వీఆర్ గ్రౌండ్ ను స్పోర్ట్ యాక్టివిటీకి మాత్రమే వినియోగించేలా చూడాలి. జాబ్ స్కిల్స్ అప్ గ్రేడ్ చేయాలి.
నారా లోకేష్ : వీఆర్ స్కూల్ విషయంలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. విద్య విషయంలో కేజీ నుంచి పీజీ వరకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చర్యలు చేపడతాం.