- శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందిస్తాం
- సిబ్బంది శిక్షణకు ప్రత్యేకంగా రెవెన్యూ అకాడమీ ఏర్పాటు
- భూరికార్డుల పటిష్ట నిర్వహణకు బ్లాక్ చైన్ విధానం
- రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల మంత్రి అనగాని వెల్లడి
- సచివాలయంలో బాధ్యతల స్వీకరణ
అమరావతి: రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి వారికి మరింత చేరువ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నాల్గవ బ్లాక్లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య మంత్రిగా అనగాని పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అందించే వివిధ రకాల సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు అన్నివిధాలా కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాక రెవెన్యూ శాఖలో జవాబుదారీ తనాన్ని పెంపొందించే విధంగా అవసరమైౖన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో రెవెన్యూ సిబ్బందికి శిక్షణకై ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడిరచారు.
జూన్ 20వ తేదీ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో సర్టిఫికెట్ల జారీకి తగిన కార్యాచరణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూరికార్డుల్లో ఎవరికి నచ్చిన విధంగా వారు మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీలో రెవెన్యూ రికార్డుల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోర్టు కేసుల సమర్థ నిర్వహణకు అన్లైన్ రెవెన్యూ కోర్టు విధానాన్ని తీసుకురానున్నట్టు వెల్లడిరచారు. రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు సకాలంలో అందిస్తామన్నారు. అంతకు ముందు రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి. సాయిప్రసాద్, అజయ్ జైన్, రెవెన్యూ శాఖకు చెందిన ప్రభాకర్ రెడ్డి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన రవికుమార్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇంకా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు మంత్రికి పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.