అమరావతి(చైతన్యరథం): కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న 18 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందుకోసం స్పెషల్ టీం లను ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నాం. ఈ లోగా వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరామన్నారు. కేదార్‌నాథ్ లో చిక్కుకున్న యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా వెళ్లిన 18 మంది యాత్రికులు కేదార్‌నాథ్ దర్శనం తర్వాత తిరుగుపయనమై ఈ నెల 11 నుంచి అక్కడే చిక్కుకుపోయారు. వీరంతా నిజామాబాద్, విజయనగరం ప్రాంతాలకు చెందినవారు. వర్షాల వల్ల కేదార్‌నాథ్, బద్రీనాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సర్వీసులు కూడా నిలిపివేశారు. దీంతో కేదార్‌నాథ్ దర్శనం అనంతరం బద్రీనాథ్ వెళ్లాల్సి ఉన్న యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా తెలుగు యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.