- ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా సమస్యలు రానివ్వం
- కనీస మద్దతు ధర చెల్లించే బాధ్యత తీసుకుంటాం
- 24 గంటల్లో 93 శాతం రైతుల ఖాతాల్లో డబ్బు జమ
- మిల్లర్లు కూడా సహకరించాలి
- అవకతవకలకు పాల్పడే మిల్లర్లను బ్లాక్‌లిస్టులో పెడతాం
- రైతుల్ని ఇబ్బందిపెడితే దళారులపై క్రిమినల్ చర్యలు
- మంత్రి మనోహర్ స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): రైతు పండిరచిన చివరి బస్తా వరకు కొనుగోలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రతి బస్తాకు కనీస మద్దతు ధర చెల్లించే కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. కనీస మద్దతు ధర వ్యవహారంలో అవకతవకలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు. మిల్లర్ల వద్ద మోసం జరిగిందని తెలిస్తే అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. వాతావరణ పరిస్థితులను అడ్డుపెట్టుకుని కొంత మంది దళారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని, కనీస మద్దతు ధర కంటే తక్కువ చెల్లించి కొనుగోలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో ధాన్యం కొనుగోళ్లపై క్షేత్ర స్థాయిలో మంత్రి పరిశీలన జరిపారు. చల్లపల్లి, ఘంటసాల మండలాల పరిధిలో స్థానిక శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్‌తో కలసి రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాసుల వద్ద రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవనిగడ్డలో ధాన్యం కొనుగోళ్లపై రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించామన్నారు. ఇక్కడ ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికే ధాన్యం అమ్మేందుకు రైతులు వేచిచూస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా 40 రోజులపాటు సాగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ మూడు రోజుల్లో చేపట్టాల్సి రావడంతో కొంత మేర ఇబ్బందులు తలెత్తాయి. ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించి రైతు పండిరచిన ప్రతి గింజను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించాము. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే డబ్బు వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. 24 గంటల్లో 93 శాతం రైతులకు డబ్బు వారి ఖాతాల్లో జమయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 2,800 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే లక్షా 24 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎక్కడా పొరపాటు లేకుండా రైతుకు అండగా నిలబడుతుంది. రైతుని రాజు చేయడమే లక్ష్యంగా తామంతా పని చేస్తున్నామని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు.
తొలిసారి కౌలు రైతులకు ఈ` క్రాప్ నమోదు సౌకర్యం
ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే గత ప్రభుత్వం రైతులకు పెట్టిన రూ. 1674 కోట్ల బకాయిలు చెల్లించాం. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలోనూ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాము. రైతు భరోసా కేంద్రాలను రైతు సహాయ కేంద్రాలుగా మార్చి అధికారులను క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచాం. తొలిసారి కౌలు రైతులకు కూడా ఈ-క్రాప్ నమోదుకు అవకాశం కల్పించాం. కౌలు రైతులకు నేరుగా అకౌంట్లలో డబ్బు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం ఏ మిల్లుకు తీసుకువెళ్లాలనేది రైతు చేతిలో ఉండేది కాదు. సుదూర ప్రాంతాలకు ధాన్యాన్ని సొంత ఖర్చులతో తరలించి మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఉండేవి. అలాంటి ఇబ్బందులను అధిగమించి రైతే కావాల్సిన మిల్లును ఎంచుకునే వెసులుబాటు కూటమి ప్రభుత్వం కల్పించింది. కనీస మద్దతు ధర రూ. 1725కి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. కొంత మంది దళారులు వర్షాలు వచ్చాక రైతులను మభ్యపెట్టి రూ. 1400కి కొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అత్యవసర పరిస్థితులలో 25 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించాం. రూ. 1725 కనీస మద్దతు ధరకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మిల్లర్లకు సైతం ఉంది. కృష్ణా జిల్లావ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో సగం మిల్లుల్లోనే డ్రయ్యర్లు ఉన్నాయి. మిల్లర్లు డ్రైయింగ్ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రూ.9 సబ్సిడీ మిల్లర్లకే చెల్లిస్తాము. కృష్ణా జిల్లావ్యాప్తంగా మొత్తం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంటే, రెండు రోజుల్లోనే కొనుగోళ్లు లక్ష మెట్రిక్ టన్నులు దాటాయి. కొంత మంది దళారులు చేసిన ప్రచారం కారణంగా ప్రభుత్వ కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందన్న భావనలో రైతులు ఉన్నారు. రైతులు అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందని మంత్రి మనోహర్ తెలిపారు.
వచ్చే ఖరీఫ్ నాటికి సమస్యలన్నీ అధిగమిస్తాం
గడచిన ఐదేళ్లలో రైతులు అధికారులను కలిసి తమ సమస్యలు చెప్పుకొనే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారులనే రైతుల దగ్గరకు పంపుతోంది. దేశంలో మొదటిసారిగా ఏఐ టెక్నాలజీ సాయంతో రైతుల సౌలభ్యం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఆ నంబర్ కి రైతు వాట్సప్ లో హాయ్ పెడితే చాలు ఎవ్వరితో సంబంధం లేకుండా ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించాము. 7337359375 కి హాయ్ పెట్టి రైతు నేరుగా ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ఈ ప్రాంతంలో పండే బీపీటీ 1262తో పాటు కొన్ని రకాల గురించి ఆందోళన ఉంది. ఉదయం అధికారులతో సమీక్షించి రకంతో సంబంధం లేకుండా ప్రతి గింజా రైతు నుంచి కొనుగోలు చేయాల్సిందేనని ఆదేశాలిచ్చాము. గోతాల విషయంలోనూ అధైర్యపడవద్దు. మా ప్రభుత్వంలో నిజాయితీ ఉంది. వచ్చే ఖరీఫ్ నాటికి సమస్యలు అధిగమిస్తాం. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ప్రభుత్వం తరఫున డ్రయ్యర్ సదుపాయం ఏర్పాటు చేస్తాం.
ఇప్పటికే దీపం పథకం ద్వారా నెల రోజుల్లోనే 82 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాము. క్షేత్ర స్థాయి పర్యటనలో రోడ్ల మీద ఆరబెట్టిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఎక్కడా సమస్యలు రాకుండా చూసుకుంటాం. ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి మనోహర్ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డీఓ కె. స్వాతి, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్, జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, స్థానిక అధికారులు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు.