అమరావతి: వచ్చే రెండున్నరేళ్లల్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పీ నారాయణ స్పష్టం చేశారు. మంత్రులకు శాఖలు కేటాయించిన అనంతరం శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం 58 రోజుల్లో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. గడిచిన ఐదేళ్లలో రాజధాని పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిరదని విమర్శించారు. అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకొని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా నిర్మాణ పనులు చేపడతామన్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ మున్సిపల్ శాఖను నిర్వీర్యం చేశారన్నారు. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త వైసీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. చెత్తపన్నుపై సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు.