- నేమకల్లు ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- పేదలకు అండగా, సంక్షేమం నిండుగా..ఇదే ప్రభుత్వ విధానం
- రేషన్ మాఫియాపై ఉక్కుపాదం
- ల్యాండ్, శాండ్, గంజాయి మాఫియాలనుండి రాష్ట్రానికి విముక్తి
- సాంకేతికత అనుసంధానంతో సెల్ ఫోన్‌ల ద్వారా పౌర సేవలు
- హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ
అనంతపురం (చైతన్యరథం): రాష్ట్రంలో సంపద సృష్టి ద్వారా అభివృద్ధి చేస్తూ ఆ ఫలాలను తిరిగి పేదలకు అందజేస్తామని, ఇదే తమ ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో శనివారం మధ్యాహ్నం లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద 4,000 రూపాయల వితంతు పెన్షన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అందజేశారు. అనంతరం ఇందిరమ్మ కాలనీలో గ్రామస్తులతో ముచ్చటించి వారితో ఫొటో దిగారు. తదనంతరం అదే కాలనీలో లబ్ధిదారురాలు బోయ భాగ్యమ్మ ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 15 వేల రూపాయల వికలాంగుల పెన్షన్‌ను స్వయంగా అందజేశారు.
ఆ తరువాత గ్రామంలో ప్రసిద్ధి గాంచిన శ్రీఆంజనేయస్వామి దేవాలయానికి చేరుకుని స్వామి వారిని సీఎం దర్శించుకున్నారు. దేవాలయంలోని స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీఆంజనేయస్వామి దేవాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక – పేదల సేవలో.. కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. తమ్ముళ్లు హుషారుగా ఉన్నారా…. ఆడబిడ్డలూ.. ఆనందంగా ఉన్నారా అంటూ ఆప్యాయంగా పలకరించి ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రతిపక్షనేతగా ఏప్రిల్ 11వ తేదీన అనంతపురం జిల్లాలోని కనేకల్లుకు వచ్చాను. తిరిగి మరల ఈరోజు వచ్చాను. ఆ రోజు నేను 11వ తేదీన వచ్చినందుకు తరువాత జరిగిన ఎన్నికల్లో మీరు 11 సంఖ్యలోనే సీట్లు ఇచ్చి అప్పటి అధికార పక్షాన్ని ఓడిరచారని చమత్కరించారు. గ్రామాలకు మంచి రోజులు వస్తాయని, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, భూకబ్జాలు చేసే వారి భరతం పడతానని ఆ నాడు హామీ ఇచ్చాను. రాయలసీమను రతనాలసీమగా చేస్తామని చెప్పాను. మీ ఆశలు నెరవేర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 93 శాతం స్ట్రైక్ రేట్‌తో, 57 శాతం ఓట్లు వేసి కూటమి సర్కార్‌ను గెలిపించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
పేదలకు అండగా ప్రభుత్వం
వెనుకబడిన అనంతపురం జిల్లాలో రాయదుర్గం ప్రాంతం మరింత వెనుకబడి ఉందని, ఈ ప్రాంతం ఎడారీకరణ జరగకుండా చూసేదుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుని మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతానికి మేలు చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాపై రూ. 4,500 కోట్లు ఖర్చుపెట్టాం, రాయలసీమలో ఇరిగేషన్‌పై రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాంతంలోని భైరవాణితిప్ప ప్రాజెక్ట్‌కు రూ.968 కోట్లు మంజూరు చేసి 35 శాతం పనులు పూర్తి చేశాం. తరువాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రాజెక్ట్‌లో మిగిలిన పనులను పూర్తిచేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేలా ఆత్మస్థైర్యాన్ని, శక్తిని, ధైర్యాన్ని, తెలివితేటలు ఇవ్వాలని మీ ఊరి ఆంజనేయస్వామిని ప్రార్థించాను. పేదల పక్షాన ఉండాలనేదే ఎప్పుడూ నా ఆలోచన. కష్టాల్లో ఉన్నవారికి పూర్తిగా అండగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను నెలకు 3,000 నుంచి 4 వేలకు పెంచి ఏప్రిల్, మే, జూన్ నెలల అరియర్స్‌తో కలిపి అందించాం. రాష్ట్రంలో 64 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను ఇస్తున్నాం. పింఛన్ల రూపంలో ఐదు నెలల కాలంలో రూ.18 వేల కోట్లు పేదలకు ఇవ్వడం ద్వారా నా జీవితం ధన్యమైంది. 64 లక్షల మందికి నెలకు 2,790 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సంవత్సరానికి రూ.53,099 కోట్లు పింఛన్లపై ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. లబ్ధిదారులు 1, 2 నెలల పెన్షన్లు తీసుకోకపోయినా మూడు నెలల మొత్తం కలిపి ఒకేసారి చెల్లిస్తాం. పింఛన్ దారు ఎవరైనా చనిపోతే వారి భార్యకు కూడా వెంటనే వితంతు పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కేటగిరీని బట్టి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల ప్రకారం పెన్షన్లు ఇస్తున్నాం. అలా పేదవారికి సహాయం చేస్తున్న ప్రభుత్వం మాదే. ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రం ఇచ్చినంత మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం లేదు. కర్ణాటకలో 1,200, కేరళలో 1,600, ఒడిశాలో 700, తెలంగాణలో 2,000, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో వెయ్యి రూపాయలు చొప్పున పెన్షన్లు ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల కన్నా అధికంగా మన రాష్ట్రంలో పెన్షన్లను ఇస్తున్నాం. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి. అధికారంలోకి రాగానే ఉద్యోగుల మాదిరిగానే ప్రతినెలా ఒకటవ తేదీనే పెన్షన్లను అందించే ఏర్పాటు చేశాం. ఒకటో తేదీ సెలవు రోజు ఉన్న కారణంగా ముందు రోజు 30వ తేదీనే పెన్షన్లను మీ ఇంటి వద్దకు వచ్చి అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి నేరుగా లబ్ధిదారులకు నేను ఫోన్ చేస్తాను. ఆలస్యంగా ఇస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. పింఛన్ల పంపిణీ బాధ్యతగా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించాను. పింఛన్ల పంపిణీ అవినీతి రహితంగా చేయాలని, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించి పింఛన్లను అందజేయాలని ఆదేశించాం. అందుకే ఈ కార్యక్రమానికి పేదల సేవలో అని నామకరణం చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతాం
గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. విధ్వంస పాలన చేశారు. తవ్విన కొద్దీ అవినీతి, అప్పులు కనబడుతున్నాయి. రూ. 10 లక్షల కోట్లు అప్పు చేశారు. అయినా కూడా ఉద్యోగుల జీతాలు సక్రమంగా ఇచ్చేవారు కాదు. మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి మద్యంపై 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకువచ్చారు. చాలా దుర్మార్గమైన పనులు చేశారు. ఎమ్మార్వో కార్యాలయాలను, ఆసుపత్రులను సైతం తాకట్టు పెట్టారు. నాకున్న అనుభవంతో మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం. ఇందుకోసం ఆరు నెలలుగా శ్రమిస్తున్నా. ముఖ్యమంత్రి అయ్యాక తొలి 5 సంతకాలలో ఒకటి డీఎస్సీ ఫైల్‌పై పెట్టాను. త్వరలో పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పింఛన్ల పెంపుపై, అన్న క్యాంటీన్ల పున:ప్రారంభం ఫైళ్లపై తరువాత సంతకాలు పెట్టాను. అన్న క్యాంటీన్లలో పేదలందరూ ఐదు రూపాయలకే కడుపు నిండా తింటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 195 అన్న క్యాంటీన్లు ప్రారంభించి ఒక కోటి 25 లక్షల మందికి ఆహారం అందజేసిన ఘనత మాకు దక్కుతుంది. ఆడబిడ్డల కష్టాలు చూడలేక గతంలో మా ప్రభుత్వంలో ఉచితంగా దీపం గ్యాస్ కింద కనెక్షన్లు ఇచ్చాం. ప్రస్తుతం దీపం`2 పథకం కింద మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నాం. ఇందుకోసం ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. రైతులకు మేలు కలిగేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. భూ కబ్జాల నిరోధానికి ఆంటీ ల్యాండ్ గ్రాబింగ్ ఆక్ట్ తీసుకొచ్చాం. మీ భూమి జోలికి వస్తే కబ్జాదారుల తాట తీస్తాం. భూ రికార్డులు కూడా గత పాలకులు ఇష్టానుసారంగా మార్పు చేశారు. ప్రభుత్వానికి అందే అర్జీల్లో 40 నుంచి 50 శాతం పిటిషన్లు భూ సమస్యలపైనే వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
గంజాయి కట్టడికి చర్యలు
గత పాలకులు మద్యాన్ని కూడా సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రస్తుతం దానిని ప్రభుత్వ ఆదాయంగా మారుస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేసి నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నాం. మద్యం తయారీ నుంచి షాపుల్లో అమ్మకాల వరకు వారి మనుషులని పెట్టి అందినకాడికి దోచుకున్నారు. మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగపడుతుంది. మద్యం దోపిడీకి అడ్డుకట్ట వేశాం. బెల్టు షాపులను సహించేది లేదు. మద్యం వ్యాపారంలో తల దూరిస్తే ఏ నాయకుడినీ ఉపేక్షించేది లేదు. ఇసుక ప్రకృతి ఇచ్చిన వరం. దానిలో కూడా గత ప్రభుత్వం దందాలు చేసి వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిరది. గత ప్రభుత్వ దోపిడీతో ఇసుక అందుబాటులో లేక 45 లక్షల మంది భవన కార్మికులు ఉపాధి లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఇసుక ప్రజలందరిదీ. ఎద్దుల బండి, ట్రాక్టర్లు తీసుకెళ్లి ఉచితంగా ఇసుకను తెచ్చుకోండి. ఇసుకలో ఎ నాయకుడైనా తలదూర్చి దందాలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటా. ఇంకొక వైపు గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా గంజాయి పంట యథేచ్చగా సాగయ్యేది. విశాఖపట్నంను గంజాయి రాజధానిగా మార్చారు. కూటమి ప్రభుత్వం గంజాయి కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా గంజాయి పండిరచినా, అమ్మినా అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నా. గంజాయి పండిరచినా, అమ్మినా, మత్తు పదార్థాలు అమ్మినా ఖబడ్దార్.. డేగ కన్నుతో పరిశీలిస్తున్నాం. గంజాయి కట్టడికి దానిపై ఈగల్ పేరుతో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, గంజాయి మాఫియా లేకుండా చేస్తాం. పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే దుర్మార్గమైన పనులకు పాల్పడుతున్నారు. పేదల బియ్యం రీసైకిలింగ్ చేసే వారిని హెచ్చరిస్తున్నా. ఎవరైనా అలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. గత పాలకులు చెత్త మీద పన్ను వేశారు. అయినా 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, గతంలో మా ప్రభుత్వంలో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేశారు. మా ప్రభుత్వంలో గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేస్తాం. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. టీడీపీ ప్రభుత్వాలు మొదటినుంచీ బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను బోయ కులానికి ఇచ్చాం. రాష్ట్రంలో 10 శాతం మద్యం షాపులని గీత కార్మికులకే కేటాయిస్తున్నాం. ఆలయాల్లో అర్చకులకు పదివేల నుంచి 15,000 కు జీతాలు పెంచాం. నాయీ బ్రాహ్మణుల వేతనాన్ని రూ.15,000 నుంచి 25000 చేశాం. ఆలయాలకు ధూప, దీప నైవేద్యాల కోసం ఇచ్చే మొత్తాన్ని ఐదువేల నుంచి పదివేల రూపాయలకు పెంచాం చేనేతపై జీఎస్టీ ఎత్తివేసాం. చేనేతలు ఇల్లు కట్టుకుంటే 50,000 అదనంగా ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఆన్ లైన్‌లో పౌర సేవలు
రెవిన్యూలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా కేవలం సెల్‌ఫోన్‌లో ఒక మెసేజ్ పెడితే మీకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపు 150 పౌరసేవల్ని ఆన్‌లైన్‌లో పెట్టి టెక్నాలజీ ద్వారా మీకు సేవలు అందజేసే ఏర్పాటు చేస్తున్నాం. అన్ని సేవలు ఆన్‌లైన్‌లో పెడుతున్నాం. ప్రజలకు ఫోను చేసి వారి స్పందన అడుగుతాం. వాస్తవాలు చెప్పాలి. తద్వారా మరింత మెరుగైన సేవలకు ఆస్కారం ఉంటుంది. ఫోన్‌లో వాట్సాప్ మెసేజ్ పెడితే ధాన్యం సేకరించే ఏర్పాటు చేశాం. సేకరించిన తరువాత 48 గంటల్లో ఆ డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తున్నాం. ఆ తర్వాత ఫోన్ చేసి రైతులకు సౌకర్యంగా ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా..
గత పాలకులు రాష్ట్రాన్ని గుంతల మయంగా చేసి వెళ్లారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు మా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతిలోపు పనులు పూర్తి చేస్తాం. ఆర్ అండ్ బి రోడ్లకి రూ. 861 కోట్లు శాంక్షన్ చేశాం. మరో 500 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు ఎక్కువగా ప్రోత్సాహకాలు ఇస్తాం. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ అన్నా. ప్రస్తుతం స్పీడ్ అఫ్ బిజినెస్ డూయింగ్ అంటున్నా. త్వరలో నైబర్హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఇంట్లోనే ఉండి యువత సెల్‌ఫోన్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తాం. దాంతో కుటుంబాలు బాగుపడతాయి. మహిళలలో కూడా చదువుకున్న వారు ఉన్నారు. ఇంట్లో పని చేసుకుంటూనే తీరిక సమయంలో ఐదారు గంటలు పని చేయగలిగితే వారు కూడా డబ్బులు సంపాదించే అవకాశం చూపిస్తాం. ఇందుకు ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.
నెంబర్ వన్‌గా రాష్ట్రం
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. తాడిపత్రి నుంచి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి విదేశాలకు అరటిని ఎగుమతి చేస్తున్నారంటే అదే టీడీపీ ప్రభుత్వ దూర దృష్టి, దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలి. అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ వచ్చింది మా హయాంలోనే. హంద్రీ నీవా, హెచ్‌ఎల్సీ ఆధునీకరణతో నీటి కొరత తీర్చేందుకు కృషి చేస్తున్నాం. విజన్` 2047 డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. 2047కు దేశంలోనే మన రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. పేదరిక నిర్మూలన కొరకు కృషి చేస్తున్నాం. గతంలో అప్పటి పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నియంత్రణ గురించి చెప్పాను. కానీ ప్రస్తుతం యువత తగ్గుతుండడంతో… జనాభాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన కుటుంబమే మన ఆస్తిగా తయారవుతుంది. ప్రతి కుటుంబానికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.