- సచివాలయంలో బాధ్యతల స్వీకరణ
అమరావతి: పారిశ్రామిక వృద్ధిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గుజరాత్‌లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. గురువారం ఉదయం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్‌లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ది పర్చేందుకు పటిష్టమైన ప్రణాళికలతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తామన్నారు. దేశ,విదేశాలకు చెందిన పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి తరలి వచ్చేలా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు. పెండిరగ్‌లో ఉన్న పారిశ్రామిక రాయితీలను వెంటనే విడుదల చేస్తామన్నారు. 2014-19, 2019-24 మధ్యకాలంలో జరిగిన ఎంఓయూలన్నీ వాస్తవరూపం దాల్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కర్నూల్లో హైకోర్టు బెంచ్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు
గురువారం ఉదయం 9 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖల మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాలుగో బ్లాక్‌లో ఆయనకు కేటాయించిన ఛాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎంతో ఘనంగా రాష్ట్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా భాద్యతలు చేపట్టేందుకు సతీసమేతంగా రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతోను, అధికారులు పుష్పగుచ్ఛాలతోను ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి, ఎండి యువరాజ్, అదనపు సెక్రెటరీ మోహన్‌రావు, పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శు ద్ధి శాఖలకు చెందిన పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.