తిరుపతి: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన నాయకుడు కెే నాగబాబుతో కలిసి జేపీ నడ్డా శనివారం తిరుపతిలో రోడ్‌షో నిర్వహించారు. జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు వేలాది జనసందోహం మధ్య రోడ్ షో జరిగింది. అనంతరం జరిగిన సభనుద్దేశించి బీజేపీ చీఫ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పురోగమిస్తోందన్నారు. సామాన్యులు, దళితులు, యువత, రైతులు సాధికారత సాధించారన్నారు. దేశంలోని 1.50 లక్షల పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానం చేస్తున్నామన్నారు. ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా రెండు లక్షల గ్రామాలకు అనుసంధానం చేశారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని, మళ్లీ అధికారంలోకి వస్తే మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి మోదీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. తిరుపతి ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమని.. మోదీ ఈ నగరాన్ని ఐటీ కేంద్రంగానూ తీర్చిదిద్దుతారన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని చెప్పారు.
అంతకుముందు ఉదయం తిరుపతి చేరుకున్న జేపీ నడ్డా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… శ్రీవారిని దర్శించుకుని.. స్వామి వారి ఆశీర్వాదం పొందానన్నారు. దేశం, సమాజంలో ప్రజలందరూ సుఖంగా ఉండడంతో పాటు అభివృద్ధి చెందాలని స్వామి వారిని ప్రార్థించానని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో సమృద్ధి భారత్, సంక్షేమ భారత్, సురక్షిత భారత్ దిశగా దేశం పయనించాలని వేడుకున్నట్లు జేపీ నడ్డా పేర్కొన్నారు.