శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామని శనివారం మీడియాకి విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్ ట్రాక్, గుర్రపు స్వారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు.
ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నంబర్లలో ఎర్రగుట్ట పైన ఉన్న 15 ఎకరాలను దొంగ పత్రాలు సృష్టించి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాజేశారని ఆయన ఆరోపించారు. ఎర్రగుట్టపై భూములను కొట్టేయడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. హైదరాబాదుకు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి సదరు సర్వేనెంబర్ పై రుణాలు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు తయారుచేశారని.. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వాటిని వేలంలో తమ కుటుంబ సభ్యులు కొన్నట్లు రికార్డులు తయారుచేసి భూములను కొట్టేశారు. ఎర్రగుట్టపై మరో 5 ఎకరాలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబంలోని మహిళ పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారని, ఇవి పిత్రార్జితంగా ఆమెకు సంక్రమించినట్లు రికార్డుల్లో చూపారన్నారు. అయితే సదరు కుటుంబ సభ్యురాలిది కర్నూలు జిల్లా గాక ఇక్కడికి ఇచ్చి వివాహం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన మహిళ తండ్రికి ఇక్కడ గుట్టపై భూమి ఎలా సంక్రమించిందని అధికారుల్ని ప్రశ్నించారు.
ఎర్రగుట్టపై ఉన్న సర్వే నంబర్లకు సంబంధించి రికార్డులు సమర్పించాలని ఆర్.టి.ఐ ద్వారా అడగగా వాటికి సంబంధించిన రికార్డులు లేవంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారని చెప్పారు. రికార్డుల్లో లేని భూమి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరుతో ఎలా నమోదు అయిందని ప్రశ్నించారు. అలాగే పోతుల నాగేపల్లి పరిధిలోని 42, 43 సర్వే నెంబర్లలో అసైన్డ్ భూములను రైతులను బెదిరించి లాక్కోవాలని ప్రయత్నించినట్లు ఆరోపించారు. విషయం ఎస్సీ కమిషన్ వరకు వెళ్లడంతో అప్పటి కలెక్టర్ గంధం చంద్రుడు అడ్డుకున్నారని తెలిపారు. అందుకే ఆయనపై కక్ష పెంచుకుని ఇక్కడి నుంచి బదిలీ చేయించినట్లు ఆరోపించారు.
తెదేపా అధికారంలోకి రాగానే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ అక్రమాలతో పాటు రాష్ట్రంలోని వైకాపా ఎమ్మెల్యేలందరి అవినీతిపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.