టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నేతలు కబ్జా చేసి వక్ఫ్ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కడప రెండవ గాంధీ విగ్రహం వద్ద ముస్లిం సామాజికవర్గీయులు యువనేతను లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ పాలనలో మైనారిటీలు పూర్తిగా మోసపోయారు. గత ప్రభుత్వంలో మైనారిటీలకు అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు.
టీడీపీ హయాంలో రూ.27కోట్లతో హజ్ హౌస్ నిర్మిస్తే, దానిని నాలుగేళ్లుగా పాడుబెట్టారు. రఖీబ్ షా వలీ దర్గా ఆస్తులను బలవంతంగా కబ్జా చేశారు. దండు ఈద్గా వద్దనున్న చారిత్రాత్మక శ్మశాన స్థలాన్ని ఇతరులకు కట్టబెట్టారు. కడప నడిబొడ్డున 4 శతాబ్ధాలుగా ఉన్న దర్గా వద్ద దౌర్జన్యంగా మరుగుదొడ్లు నిర్మించారు. గుర్రాలగడ్డ-రవీంద్రనగర్ ను అనుసంధానం చేసే బుగ్గవంక బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపేశారు. వక్ఫ్ బోర్డు స్థలాలకు రక్షణ కరువైంది. ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలు నిలిపేశారు. దుల్హన్ పథకానికి అర్థం లేని షరతులు విధించి లబ్ధిదారులను మోసం చేశారు. మైనారిటీలకు విదేశీవిద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మైనారిటీల సమస్యల్ని పరిష్కరించాలి.
మైనారిటీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించండి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మైనారిటీల మానప్రాణాలతో పాటు ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వేలకోట్ల రూపాయల మైనారిటీల ఆస్తులను వైసిపినేతలు కబ్జా చేశారు. నర్సరావుపేటలో మసీదు ఆస్తులను కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను వైసిపి గూండాలు దారుణంగా నరికి చంపారు. మైనారిటీలపై ఇదివరకెన్నడూ లేనివిధంగా అఘాయిత్యాలు జరుగుతున్నా కడపకు చెందిన మైనారిటీ మంత్రి నోరు మెదపడం లేదు. గత నాలుగేళ్లలో రూ.5,355 కోట్ల సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది. మైనారిటీల కోసం గతంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. దామాషా పద్ధతిన మైనారిటీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.