టిడిపి అధికారంలోకి వచ్చాక వెంగళాయదొడ్డికి నీరందించేందుకు చర్యలు తీసుకుంటాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆలూరు నియోజకవర్గం కైరుప్పల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో వెంగలాయ దొడ్డి చెరువు ఉంది. ఈ చెరువు కింద ప్రత్యక్షంగా నాలుగు గ్రామాలు, పరోక్షంగా మూడు గ్రామాల్లో వ్యవసాయం సాగవుతోంది. వెంగలాయదొడ్డి చెరువు నిండకపోవడం వల్ల మా పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. మాకు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని నాలుగేళ్లుగా కలెక్టర్ కు వినతిపత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి మమ్మల్ని ఆదుకోండి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తాగు, సాగు నీటి ప్రాజెక్టుల పనులు వేగవంతంగా జరిగాయి. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకోసం చంద్రబాబునాయుడు రూ.11వేల కోట్లు ఖర్చుచేశారు. గత ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా పనులను 90శాతం పూర్తిచేస్తే, నాలుగేళ్లలో మిగిలిన 10శాతం పనులు చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.