గుడివాడ: మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్, తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార సమితి ఆధ్వర్యంలో గుడివాడలో ఈ నెల 18న నిరాహార దీక్షకు తెలుగుదేశం పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు అనమతివ్వాలని గుడివాడ పోలీసులకు సోమవారం వినతిపత్రం అందించారు. మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడు, వారి కుటుంబ సభ్యులనుద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, వారి వ్యక్తిత్వాన్ని హరించేలా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్దంగా చేపట్టే నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలంటూ డిఎస్పీకి లేఖ అందించారు. డిఎస్పీని కలిసిన వారిలో డూండి రాకేశ్ తో పాటు తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత పాల్గొన్నారు.