- రూ. 3 లక్షల చొప్పున ఆర్థికసాయం పత్రాలు అందజేత
నూజివీడు, గుడివాడ, పెనమలూరు (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ కార్యకర్తల్లో పార్టీ పట్ల ఎనలేని నిబద్ధత ఉంటుందన్నారు. పార్టీ కోసం ఎలాంటి త్యాగం చేసేందుకైనా కార్యకర్తలు సదా సిద్ధంగా ఉంటారన్నారు. అలాంటి కార్యకర్తల కుటుంబాలకు కష్టం వస్తే ఆదుకునేందుకు ఎంత దూరమైనా వెళతామని భువనేశ్వరి స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పి, కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం భువనేశ్వరి ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యకర్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. గురువారం మొత్తంగా ఎనిమిది మంది కార్యకర్తల కుటుంబాలను కలిసి భువనేశ్వరి ఓదార్చారు.
నూజివీడు నియోజకవర్గం, అగిరిపల్లి మండలం, తోటపల్లి గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 20న మృతి చెందిన బెజవాడ రామారావు(80), అగిరిపల్లిలో గత ఏడాది సెప్టెంబర్ 15న మృతి చెందిన కడవకొల్లు శ్రీరాములమ్మ (76), అదే గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 10న మృతి చెందిన పలగాని చంద్రయ్య (78), నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 11న మృతి చెందిన వెనిగళ్ల పూర్ణచంద్రరావు(70), గుడివాడ నియోజకవర్గం, గుడివాడ రూరల్ మండలంలో గత ఏడాది సెప్టెంబర్ 11న మృతి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు (40), గుడ్లవల్లేరు మండలం, అంగలూరు గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 19న మృతి చెందిన చేబ్రోలు కోటేశ్వరరావు (62), గుడ్లవల్లేరు మండలం, పొలిమేట్ల గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 25న మృతి చెందిన అట్లూరి వీర లక్ష్మణ సంజీవరావు (63), పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ కానూరులో గత ఏడాది సెప్టెంబర్ 10న మృతి చెందిన వేమూరి పార్థసారథి (73) కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు.