అమరావతి: తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనార్టీల నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గురువారం నాడు జనసేన కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మత పెద్దలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తే తప్ప జీసస్ వాక్యాలు పాటించే వ్యక్తి కాదని చెప్పారు. జీసస్ వాక్యాలను సీఎం జగన్ పాటిస్తే ఏపీని ఇబ్బందుల పాల్జేసేవాడు కాదన్నారు. మైనార్టీల హక్కుల పరిరక్షణకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు. తన మతాన్ని ప్రేమించి… ఇతర మతాలను గౌరవించేవాడే ప్రజలకు న్యాయం చేయగలడని అన్నారు. పాస్టర్లకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. తాను మతాల గురించి మాట్లాడే సందర్భంలో కొంత మందికి ఇబ్బంది కలగవచ్చని… అందుకు కారణం ఒక విధమైన అభద్రతా భావమని తెలిపారు. ఈ రాజకీయ నాయకులు సెక్యులరిజం అనే పదాన్ని ఓటు బ్యాంకుగా మలిచేశారన్నారు. మైనార్టీలపై దాడి జరిగినప్పుడు మాత్రమే అందరూ మాట్లాడతారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
క్రిస్టియన్లకు అండగా నిలబడతా..
హిందువులపై దాడి జరిగితే ఎవరూ పట్టించుకోరన్న భావన సమాజంలో పెరిగిపోయిందన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో పలు పార్టీల్లోని నేతలు రాజకీయాలకు అతీతంగా ప్రవర్తించాలని కోరారు. జగన్ హయాంలో 517 దేవాలయాలు అపవిత్రమయ్యాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక క్రైస్తవ సమాజం ఇలాంటి పనులకు పాల్పడుతోందన్న భావన అంతర్గతంగా పెరిగిపోతుందని.. ఇది ప్రమాదకరమని హెచ్చరించారు. తాను ఇలాంటి రుగ్మతలను పూర్తిగా తీసేయాలన్న లక్ష్యంతో మాట్లాడతానని అని చెప్పారు. క్రిస్టియన్ల మనోభావాలకు, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగితే జనసేన తరఫున క్రిస్టియన్ మైనార్టీల పక్షాన బయటకి వచ్చి వారికి అండగా నిలబడతానని ధైర్యం కల్పించారు. జగన్ మాదిరిగా తాను మాటలు చెప్పనని. మాట ఇచ్చే ముందే ఆలోచించి మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏ హామీని
జగన్ నిలబెట్టుకోలేదు
ఏపీవ్యాప్తంగా 97 వేల మంది పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు 8500 మందికి మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు. మాట ఇస్తే కచ్చితంగా నిలబడాలని, రాజకీయ నాయకుడి మాటకు చాలా విలువ ఉంటుందన్నారు. మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు , ఉద్యోగులకు గౌరవ వేతనం.. ఏ హామీని జగన్ నిలబెట్టుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన క్రైస్తవులకి ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. క్రిస్టియన్లకు గౌరవం ఇవ్వడం అనే అంశాన్ని తాను ఇంటి నుంచే మొదలుపెడతానని చెప్పారు. ఎన్నికల కోసం తాను నటించనని… తాను సత్యాన్ని చెప్పడానికే నిర్ణయించుకున్నానని తెలిపారు. మైనార్టీలకు కేటాయించిన నిధులు క్రిస్టియన్ మైనార్టీలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.ఈ అంశం మీద విచారణ జరిపి వారికి అందాల్సిన నిధులు వారికి ఇప్పించే ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.