- చంద్రంపాలెం జడ్పీహెచ్ పాఠశాల ఆకస్మిక తనిఖీ
- సమస్యలపై విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి
- మరుగుదొడ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి, సరిచేయాలని ఆదేశం
విశాఖపట్నం(చైతన్యరథం): విద్యార్థుల పురోభివృద్థిలో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విశాఖలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలకు విచ్చేసిన మంత్రికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలతో భారీగా స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలోని సరస్వతీ దేవి విగ్రహానికి మంత్రి పూలమాల వేశారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటారు.
నెల్సన్ మండేలా గురించి తెలుసా?
చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వివిధ సెక్షన్లను మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పాఠశాల అని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఐఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు పొందారని మంత్రి వారిని ఉత్తేజపరిచారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాలను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. ఓ విద్యార్థినిని టెక్ట్స్ బుక్ చూసి ఓ పేరా చదవమన్నారు. ఇంగ్లీషును చదవగలుగుతావా అని సదరు విద్యార్థినిని అడిగారు. దీంతో ఆ విద్యార్థి టెక్ట్స్‌బుక్ లోని ఓ పేరా చదివి వినిపించాడు. చదివి ఏం అర్థం చేసుకున్నావని, అర్థం చేసుకున్నది తెలుగులోనైనా చెప్పాలని మంత్రి సూచించారు. తెలుగులో చదివేందుకు తాను ఇబ్బందులు పడ్డ విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నారు.
పేరాగ్రాఫ్‌లో ఏం అర్థమైందని తరగతిలోని విద్యార్థులను అడిగారు. సదరు పేరాలో ఉన్న సౌతాఫ్రికా అంటే ఏమిటని, నెల్సన్ మండేలా గురించి తెలుసా అని మంత్రి ప్రశ్నించారు. విద్యార్థులందరూ సౌతాఫ్రికా అంటే ఒక దేశమని చెప్పారు. మనకు జాతిపిత మహాత్మా గాంధీ ఎలానో నెల్సన్ మండేలా కూడా స్వాతంత్య్ర సమరయోధుడని మంత్రి వివరించారు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. విద్యార్థుల ప్రోగ్రెషన్‌లో తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తల్లిదండ్రుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు.
విద్యార్థుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి
పాఠశాలలో ఉన్న ఆటస్థలం సరిగా లేదనే విషయాన్ని మంత్రి గుర్తించారు. వర్షంతో నీరు నిలవడాన్ని గమనించారు. క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పాఠశాలలో మెరుగుపర్చాల్సిన సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు వచ్చేందుకు మెయిన్ రోడ్డు దాటాల్సి వస్తోందని, ఫ్లైఓవర్ నిర్మించాలని ఓ విద్యార్థి అడిగారు. పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్, పెద్ద లైబ్రరీ నిర్మించాలని మరో ఇద్దరు విద్యార్థులు అడిగారు. పాఠశాలలో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ఉన్నాయని, ఇంగ్లీషు ల్యాబ్ కావాలని విద్యార్థులు కోరారు. సైన్స్ ల్యాబ్ లో ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయా, ప్రోగ్రామింగ్ ఎవరైనా నేర్చుకున్నారా, బైజూస్ కంటెంట్ ఎలా ఉంది, టీవీలు పనిచేస్తున్నాయా అని మంత్రి ఆరా తీశారు. ఉపాధ్యాయులు సరిగా పాఠాలు బోధిస్తున్నారా, స్కూల్ బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, బూట్ల నాణ్యత ఏవిధంగా ఉందని మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. బాగున్నాయని ముక్తకంఠంతో విద్యార్థులు చెప్పారు.
మరుగుదొడ్ల నిర్వహణలో లోపాలను గుర్తించిన మంత్రి నారా లోకేష్
పాఠశాలలో బాలురు, బాలికలు వినియోగిస్తున్న మరుగుదొడ్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఫ్లోర్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. పాఠశాలలో తాగునీరు అందించడంతో పాటు మరుగుదొడ్లలో నీటి సరఫరా మెరుగుపర్చాలని, బాలికల మరుగుదొడ్లకు సరైన డోర్లు లేవనే విషయాన్ని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులను, ఆయాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులకు ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయని ఆరా తీశారు. బాలుర మరుగుదొడ్లు సరిగా లేవన్నారు. సాధ్యమైనంత త్వరగా మరుగుదొడ్లకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.
పులిహోరలో కర్రీ గట్టిగా ఉంది
మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులను మంత్రి నారా లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పులిహోరలో కర్రీ గట్టిగా ఉంటోందని, ఒక్కోసారి పులుపుగా వస్తోందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గుడ్లు కావాలా, రాగి జావ కావాలా అని విద్యార్థులను మంత్రి లోకేష్ సరదాగా అడిగారు. తరగతి గదిలో గోడలపై మెటీరియల్ ఎవరు తయారు చేశారని అడిగారు. తామే తయారు చేశామని విద్యార్థులు చెప్పగా.. వెరీగుడ్ అని కొనియాడారు.
భవిష్యత్ లో విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం పాఠశాల ఆవరణలోని ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.