- డిప్యూటీ సీఎం పవన్‌కి బెదిరింపు ఫోన్ కాల్స్
- గంటల వ్యవధిలోనే నిందితుడి అరెస్ట్
- ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
- విజయవాడ లబ్బీపేట వాసిగా గుర్తింపు
- ఇదే నెంబర్ నుంచి గతంలో హోం మంత్రి అనితకూ బెదిరింపు కాల్స్
అమరావతి (చైతన్యరథం): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆయన పేషీకి ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన నిందితుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అభ్యంతకర భాషలో హెచ్చరిస్తూ ఆయన పేషీకి ఆగంతకుడు ఫోన్ కాల్స్ చేసి, మెసేజ్‌లు పంపటం కలకలం రేపింది. దీంతో పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్ గురించి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్‌పై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఆరా తీశారు. మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఘటనపై చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీని వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు. హోంమంత్రి ఆదేశాల మేరకు ఫోన్‌కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు దృష్టి సారించి దర్యాప్తు ప్రారంభించారు.
ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు సెల్ ఫోన్ ట్రాక్ చేయగా విజయవాడలోని లబ్బీపేట నుంచి కాల్స్, మెసేజ్‌లు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే విజయవాడ కృష్ణలంక పోలీసులు లబ్బీపేటకి వెళ్లే సరికే నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో హోంమంత్రి అనితకు సైతం ఇదే నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.