అమరావతి: ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే అటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తామని రాష్ట్ర అర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. ఆర్థికమంత్రిగా ప్రకటించిన అనంతరం శుక్రవారం పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చంద్రబాబు ఒత్తిడిలో ఉన్నప్పుడే ఆయనలో నిజమైన స్ఫూర్తి బయటకు వస్తుందని కేశవ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేసి చంద్రబాబు ఒక్కరినే అసెంబ్లీలో ఉంచారని ఆయన గుర్తుచేశారు. అప్పుడే చంద్రబాబులో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ బయటకు వచ్చిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఖజానా ఎంత ఉందో తాము ఇంకా చూడాల్సి ఉందన్నారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో నిధుల మళ్లింపు, భవిష్యత్ ఆదాయం తాకట్టు వంటి అనేక అవకతవకలు జరిగాయని పయ్యావుల అన్నారు. కాగ్ కూడా ఈ మేరకు నివేదిక ఇచ్చిందని, సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. సంపద సృష్టి పేరుతో ప్రజలపై అదనపు పన్నులు వేసేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బ్రాండ్‌తో పరిశ్రమలు, ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువస్తామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.