అమరావతి (చైతన్యరథం): డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నెట్‌వర్క్ హాస్పటళ్లకు బకాయిల కింద ఈ నెలలోనే వీలయినంత త్వరగా రూ.500 కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. మంగళవారం సచివాలయంలో బకాయిల విషయమై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, నెట్‌వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య 2 గంటలపాటు ఫలవంతమైన సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఇరువర్గాల ఇబ్బందుల గురించి సానుకూల వాతావరణంలో చర్చ జరిగిందన్నారు. ప్రజలకు నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు ఇరు పక్షాలూ కట్టుబడి ఉన్న విషయం ఈ సమావేశం ద్వారా స్పష్టమయిందన్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఈ నెలలోనే వీలయినంత త్వరగా రూ.500 కోట్లు విడుదల చేస్తామని ఆశా (ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్) ప్రతినిధి బృందానికి ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు హామీ ఇచ్చారన్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఒకే విడత ఇంత పెద్దమొత్తంలో నిధులు విడుదల చేయటం ఇదే తొలిసారి అవుతుందన్నారు.
గత ప్రభుత్వం నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.2,221.60 కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత ఆర్థిక సమయంలో నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.1,548 కోట్లు విడుదలయ్యాయి. అందరికీ ఆరోగ్యం అందించడమే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రాధాన్యత. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, నెట్‌వర్క్ ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేయడానికి వీలయిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రంలో అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించడం కోసం హైబ్రిడ్ విధానానికి మారే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ విషయమై నెట్ వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు కూడా కొన్ని సూచనలు చేశారు. వాటిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆరోగ్య రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేలా ఆసుపత్రులకు పరిశ్రమ హోదా కల్పించాలని ఈ సందర్భంగా నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు ఒక ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ సమావేశం ఫలవంతంగా జరిగిందని మంత్రి సత్యకుమార్ సంతోషం వ్యక్తం చేశారు.