- ఎన్ని నిధులు ఖర్చుచేసేందుకైనా సిద్ధం
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల (చైతన్యరథం): అవుకు రిజర్వాయర్ లీకేజీ అరికట్టడానికి ఎంతమొత్తంలో నిధులు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బీసీ జనార్దనరెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు జలాశయాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అవుకు రిజర్వాయర్ రివిట్మెంటు పనుల్లో లీకేజీలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జలాశయం రివిట్మెంట్ మరమ్మత్తు పనులను ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. భవిష్యత్తులో లీకేజ్ సమస్య ఉత్పన్నం కాకుండా పూర్తిస్థాయిలో పరిశీలించి, మరమ్మత్తు పనులు చేపట్టాలని సూచించారు. మరమ్మత్తు పనులకు నిధులు సరిపోకపోతే ప్రభుత్వంతో మాట్లాడి అదనపు నిధులు తీసుకొస్తామన్నారు. మరమ్మత్తుల పనుల నాణ్యత ప్రమాణాల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వరాదని ఆదేశించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే దాదాపు రూ. కోటి నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. రాబోయే 15 – 20 రోజుల్లో ఈ పనులు పూర్తి చేస్తాం. లీకేజీలను పూర్తిస్థాయిలో గుర్తించేందుకు నీటి లోపల ఇద్దరు నిపుణులు పనిచేస్తూ వాటిని గుర్తించి.. లీకేజీలు నిర్ధారణ అయిన తర్వాత కాంక్రీట్‌తో ఫిల్ చేస్తున్నారు. గత పదిహేనేళ్లుగా చిన్న చిన్న లీకేజీలు ఉన్నమాట వాస్తవం.. నాడు ఈ లీకేజీలపై దృష్టి పెట్టకపోవడం వల్ల నేడు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో భారీ ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ప్రజల భద్రతకు సంబంధించిన అంశం. లీకేజీలను పూర్తి స్థాయిలో అరికడతాం.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇంకా వేరే లీకేజీలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నాం. రిజర్వాయర్ కట్ట కూడా కొద్దిగా కుంగిన క్రమంలో నెలాఖరులోపు దాన్ని బలోపేతం చేస్తాం. ఈ లీకేజీలను అశ్రద్ధ చేయకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే నేను రెండుసార్లు స్వయంగా వచ్చి పర్యవేక్షించాను. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అవుకు రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. గతంలో అవుకు రిజర్వాయర్‌లో బోటు ప్రమాదం జరిగినా, అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైన మాట వాస్తవం. ఇకముందు అవుకు రిజర్వాయర్ లీకేజీల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేసే విషయంలోనూ ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పారు.















