టిడిపి అధికారంలోకి రాగానే రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దపసుపుల చావిడి వద్ద గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి. బీసీ కాలనీలో నీటి మట్టానికి తక్కువగా ఉన్న రోడ్లను లెవల్ చేయాలి. శనగ రైతులకు మద్దతు ధర క్వింటాల్ రూ.6,500 ఇప్పించాలి.
గ్రామంలోని వీధిలైట్ల సమస్యను పరిష్కరించాలి. పంట కాలువల పూడికలు తీయించాలి. గ్రామంలోని చెరువు ప్రమాదకరంగా ఉంది. చెరువు చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టించాలి. జమ్మలమడుగు నుండి పెద్దపసుపుల మధ్య ఉన్న రోడ్డును డబుల్ రోడ్డుగా చేయాలి. పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లను నిర్మించాలి. మా గ్రామం నుండి చిన్నపసుపుల, ఉప్పలపాడు, చిన్నశెట్టిపల్లికి లింకు రోడ్లు వేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి దివాలా ప్రభుత్వాన్ని చూసి కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. రోడ్లపై తట్టమట్టి పోసే దిక్కులేదు.
గత నాలుగేళ్లుగా గ్రామపంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొన్నిచోట్ల పరువుకోసం సొంత డబ్బుతో పనులు చేసిన సర్పంచ్ లు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీడీపీ పాలనలో గ్రామాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 30లక్షల ఎల్ఇడి లైట్లు వేశాం. రైతులకు రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి గిట్టుబాటు ధర కల్పిస్తానన్న సిఎం, ఎన్నికల తర్వాత ముఖం చాటేశారు. టిడిపి అధికారంలోకి రాగానే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.సిసి రోడ్లు, లింకు రోడ్లను నిర్మిస్తాం. పెద్దపసుపుల గ్రామంలో చెరువుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.