- ముంబై నటి జెత్వానీకి ధైర్యం చెప్పిన హోంమంత్రి అనిత
- కుటుంబంతో సహా హోం మంత్రిని కలిసిన జెత్వానీ
- కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరిన నటి
- కేసు ముగిసే వరకూ విజయవాడలో భద్రత కల్పించాలంటూ వినతి
అమరావతి(చైతన్యరథం): ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఎంతటివారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్‌లో కుటుంబ సభ్యులతో గురువారం తనను కలిసిన జెత్వానీకి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోం మంత్రి గుర్తు చేశారు. అందుకు ప్రభుత్వానికి, హోం మంత్రికి జెత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని నటి జెత్వానీ కోరారు. కేసు ముగిసేవరకూ విజయవాడలో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలని హోంమంత్రికి వినతి పత్రం అందజేశారు.
దీనిపై స్పందించిన హోంమంత్రి భద్రత విషయంలో భయపడాల్సిన అవసరంలేదని, లోతైన విచారణ చేసి నిందితులకు శిక్ష పడే వరకూ ప్రభుత్వం ఆమెకు అండగా ఉంటుందన్నారు. కొత్త ప్రభుత్వం స్పందించిన తీరు వల్లే ధైర్యంగా తమ బాధను గొంతు విప్పి చెప్పుకోగలిగామని హోంమంత్రితో జెత్వానీ తండ్రి అన్నారు. కేసు నమోదైన అనంతరం తన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన పత్రిక, ఛానల్‌ల గురించి హోంమంత్రికి జెత్వానీ భావోద్వేగంతో వివరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఇంకా స్వేచ్ఛ రాలేదనడానికి నీ పరిస్థితి మరో ఉదాహరణ అంటూ హోంమంత్రి అనిత.. జెత్వానీని ఓదార్చారు.
జెత్వానీ ఫోన్లు ఓపెన్ చేసే యత్నం
హోంమంత్రి అనితతో భేటీ అనంతరం తన న్యాయవాదితో కలిసి జెత్వానీ మీడియాతో మాట్లాడారు. హోంమంత్రి అనితతో తన కష్టాలు చెప్పుకున్నానని జెత్వానీ వెల్లడిరచారు. గతంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరును వివరించానని, కేసు విచారణ వేగవంతం చేయాలని కోరానని తెలిపారు. ఈ సందర్భంగా జెత్వానీ న్యాయవాది మాట్లాడుతూ, దేశంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అవడం జాతీయ స్థాయిలో సంచలనం కలిగించిందని, అది ఈ కేసు తీవ్రతకు నిదర్శనం అని వివరించారు. జెత్వానీ నుంచి తీసుకున్న ఐఫోన్లను కోర్టులో సమర్పించకుండా, ఆ ఫోన్లలోని డేటాను తెరిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అవి ఐఫోన్లు కాబట్టి, వాటిలో అత్యంత భద్రతా ప్రమాణాలు ఉంటాయి కాబట్టి సరిపోయిందని, మామూలు ఫోన్లు అయ్యుంటే ఈ పాటికి ఓపెన్ చేసి ఉండేవాళ్లని తెలిపారు.
ఐఫోన్లను తెరవడానికి ప్రయత్నించినప్పుడు జెత్వానీకి రెండు సార్లు అలర్ట్ మెసేజ్‌లు వచ్చాయని, వాటిని సాక్ష్యాలుగా చూపిస్తామని పేర్కొన్నారు. జెత్వానీ సోదరుడిపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు వెనక్కి తీసుకున్నారని, ఆమెపై పెట్టిన అక్రమ కేసును కూడా వెనక్కి తీసుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ కేసులో ఉన్న పెద్దలు ఎవరన్నది మీడియా ద్వారా ఇప్పటికే బయటికి వచ్చిందని, కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నది కూడా మీడియా ద్వారా తేటతెల్లమైందని జెత్వానీ న్యాయవాది వివరించారు. ముంబయిలో కేసును మూసివేయడం కోసమే ఈ తతంగం అంతా జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమేనన్నారు.