టిడిపి అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ పై పన్నులు తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం పెనుకొండ లో వ్యాపారస్తులతో లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ టిడిపి అధికారంలోకి రాగానే వ్యాపారులపై ఏ విధమైన వేధింపులు లేకుండా చూస్తామని చెప్పారు.
ఇసుకను సైతం తక్కువ ధరకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక, సిమెంట్ ధరలు ఆకాశాన్నంటడంతో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ ఏపి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారన్నారు. చెత్తపన్ను, బోర్డు పన్ను, బాత్ రూం పన్ను అంటూ రకరకాల పన్నులతో జగన్ వ్యాపారులను వేధిస్తున్నాడని ఆరోపించారు. చివరకు గంజాయి పెట్టీ అక్రమ కేసుతో అరెస్ట్ చేసే స్థితికి దిగజారారని విమర్శించారు. ఆస్తిపన్ను అడ్డగోలుగా పెంచటం వల్ల వ్యాపారులపై పెనుభారం పడిందన్నారు. కరోనా తర్వాత ఇస్తామన్న రీ స్టార్ట్ ప్యాకేజీ సైతం ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు.
జే టాక్స్ చెల్లించ లేక ఎంతోమంది వ్యాపారాలు మూసివేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కియా పరిశ్రమ వల్లనే అనంతపురం జిల్లాలో తలసరి ఆదాయం రూ.30 వేలు పెరిగిందన్నారు. ప్రభుత్వ పెద్దల వేధింపులు భరించలేక అనుబంధ పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పారు. అనుబంధ పరిశ్రమలు కొనసాగి వుంటే మరో లక్షమందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి అని చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే వ్యాపారులపై వేధింపులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.