- కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
- అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ‘నిజం గెలవాలి’
- ఆరు కుటుంబాలకు పరామర్శ
- రూ. 3 లక్షల చొప్పున అర్థిక సాయం అందజేత
అనంతపురం,కర్నూలు(చైతన్యరథం): ఎన్నికష్టాలు వచ్చినా టీడీపీని వీడకుండా ప్రాణాలొడ్డి పోరాడుతున్న కార్యకర్తలకు, వారి కుటుంబా లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టంచేశారు. అధినేతకోసం ప్రాణ త్యాగం చేసిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవటం తమ బాధ్యత అన్నారు. ఆ కుటుంబాలకు కష్టకాలంలో అండగా ఉంటామని, అన్ని విధాలా తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమఅరెస్ట్‌తో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యక ర్తల కుటుంబాలను పరామర్శించి,ఆర్థికసాయం అందించేందుకు నిజం గెలవాలి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి గురువారం అనంతపురం,కర్నూలు జిల్లాల్లో గుంతకల్లు, పత్తికొండ,ఆలూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. మూడు నియోజక వర్గాల్లో ఆరుగురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. మృతి చెందిన కార్యకర్తల చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులు అర్పిం చారు. కార్యకర్తల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించారు.
తొలుత గుంతకల్లు నియోజకవర్గం, గుత్తి మండలం, ధర్మపురం గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 9న మృతిచెందిన మక్కెల ఆంజ నేయులు(68) కుటుంబాన్ని పరామర్శించారు. భువనేశ్వరి. అనంతరం అదే మండలం,బేతాపల్లి గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 25న మృతి చెందిన జిగి జయమ్మ(61) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.
తరువాత పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం,మిట్టి తండా గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 9న మృతిచెందిన రామావత్ లక్ష్మి (67) కుటుంబాన్ని పరామర్శించారు. భువనేశ్వరి. అనంతరం అదే మండ లం కడమకుంట్ల గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 17న మృతి చెందిన వడ్డే చినరాముడు (55) కుటుం బాన్ని పరామర్శించారు. ఆ తరువాత పత్తికొండ నియో జకవర్గంలోనే కృష్ణగిరి మండలం, ఎర్రగుడి గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 11న మృతి చెందిన పింజరి సుభాన్(45) కుటుంబాన్ని పరామర్శించారు.
చివరగా ఆలూరు నియోజకవర్గం, ఆస్పరి మండలం, హలిగేరి గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 27 మృతి చెందిన ఉరుకుందప్ప (50) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.