- 49వ రోజు ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్ భరోసా
- ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరణ
- పలు సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు
- రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలి వచ్చిన అర్జీదారులు
అమరావతి (చైతన్యరథం): ప్రజాదర్బార్ వినతుల్లో వచ్చే సమస్యలు పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో 49వ రోజు ప్రజాదర్బార్‌కు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను విన్నవించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్.. పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అన్ని విధాల అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
విడదల రజిని అండతో అక్రమంగా సస్పెండ్ చేశారు
వైసీపీ పాలనలో అప్పటి మంత్రి విడదల రజిని అండతో నాడు-నేడు పనుల్లో అవినీతికి బాధ్యుడిని చేసి అక్రమంగా సస్పెండ్ చేశారని, తన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన స్కూల్ అసిస్టెంట్ వి.వీరయ్య.. మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. నాడు-నేడు పనుల్లో అవినీతికి పాల్పడిన చిలకలూరిపేట జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కే.రత్నజ్యోతిని కాపాడేందుకు అప్పటి పల్నాడు డీఈవో కాగిత శ్యామూల్, నరసరావుపేట ఎంఈవో ఎస్.నాగేశ్వరరావులను విడదల రజిని ప్రభావితం చేసి తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తన సస్పెన్షన్ పీరియడ్‌ను రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఆన్ డ్యూటీ గా నమోదు చేసి జీతభత్యాలు చెల్లించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో 19 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఐటీ, మేనేజర్, ఏఈ, ఎంఐసీ, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, డీఈఓ, అటెండర్ల సర్వీసును గుర్తించి కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోకి మార్చాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఐటీఐ సివిల్ బ్రాంచ్‌తో వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న వారిని ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల్లో మండల ఇంఛార్జ్‌లుగా నియమించాలని కోరారు. ఫీల్డ్ లో పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లకు, ఎంఐసీలకు ఎఫ్‌టీఏ మంజూరు చేసేలా చర్యలు తీసుకువాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడాలని విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన వారికి త్వరితగతిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం ఏజెన్సీ ప్రాంత రైతులు విజ్ఞప్తి చేశారు. ఏడేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని, గిరిజనులను కొంతమంది దళారులు తప్పుదోవ పట్టించారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
వైసీపీ అండతో తమ భూములను ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సానిపాయ గ్రామానికి చెందిన గుగ్గిళ్ల భూదేవి విజ్ఞప్తి చేశారు. గ్రామానికి చెందిన గుగ్గిళ్ల చిన్నప్ప కుటుంబం వైసీపీ నేతల అండతో తమ భూముల సరిహద్దు రాళ్లను దౌర్జన్యంగా పెకలించి ఆక్రమించారని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వే నిర్వహించిన తమ భూములను తమకు అప్పగించడంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోపాలమిత్రల సమస్యలు పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సంబంధిత సిబ్బంది విజ్ఞప్తి చేశారు. చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన గోపాలమిత్ర వ్యవస్థను వైసీసీ ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిందని, ఏహెచ్‌ఏల నియామకానికి సంబంధించిన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గోపాలమిత్రల కోసం గత టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 48ని తిరిగి అమలుచేయాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
విద్యుత్ శాఖలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. 2022 పీఆర్సీలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది బకాయిలు చెల్లించడంతో పాటు అనుభవాన్ని బట్టి కేడర్‌ను మార్చాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గంలోని కేఎల్ యూనివర్సిటీ నుంచి రేవేంద్రపాడు వరకు ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని గుండిమెడ గ్రామానికి చెందిన సరిత విజ్ఞప్తి చేశారు. వారం క్రితం కేఎల్ యూనివర్సిటీ వరకు రోడ్డు మరమ్మతులు చేసి అనంతరం పనులు నిలిపివేశారన్నారు. ఈ మార్గంలో ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని, రాత్రి వేళ్లల్లో ఎలాంటి రవాణా సౌకర్యం ఉండటం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని వివరించారు. గుండిమెడ పంచాయతీలో వీధిలైట్లు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.