ధైర్యంగా ఉండండి. రాబోయే చంద్రన్న ప్రభుత్వం అన్నదాతలకు అన్నివిధాలా అండగా నిలుస్తుంది అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆలూరు నియోజకవర్గం కారుమంచి శివార్లలో పాదయాత్ర చేస్తున్న సమయంలో పొలం పనులు చేసుకుంటున్న ఓ రైతు వద్దకు లోకేష్ వెళ్లారు. ఈ సందర్భంగా అరకదున్నుతూ రైతన్న కష్టాలు తెలుసుకున్నారు. మేం ముగ్గురు అన్నదమ్ములం కలిసే ఉంటున్నాం, మా ఉమ్మడి కుటుంబానికి 11 ఎకరాల భూమి ఉంది.
గత ఏడాని మూడు ఎకరాల్లో ఉల్లిసాగు చేయగా, వరదవచ్చి పంట మొత్తం కొట్టుకుపోవడంతో రూ.3లక్షల నష్టం వచ్చింది. 4 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే నాసిరకం విత్తనాలు కావడంతో 2 క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. మరో నాలుగు ఎకరాల్లో వేరుశనగ నాటితే 14.35 క్వింటాళ్ల దిగుబడి రాగా, పెట్టుబడి, కూలీలు పోనూ రూ.2.40 లక్షల నష్టం వచ్చింది. మేం వ్యవసాయం చేయబడ్డాక ఇంత భారీనష్టాలు జీవితంలో చూడలేదు. ట్రాన్స్ ఫార్మర్ ఫీజు వేయాలంటే హెల్పర్లు రూ.5 వందలు అడుగుతున్నారు.
ఏటికేడు నష్టాలు చవిచూస్తున్నా మరో పని తెలియకపోవడంతో వ్యవసాయం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వాలు ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని చాలించడం తప్ప మరో మార్గంలేదు అని ఆ రైతు వివరించారు. దానిపై లోకేష్ స్పందిస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానాల కారణంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టిడిపి హయాంలో ఎపిలో రైతుల సగటు అప్పు రూ.70వేలు ఉంటే, ఇప్పుడూ దేశంలోనే అత్యధికంగా రూ.2.5లక్షలకు చేరింది. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. గత ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాలు అందజేశాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన సబ్సిడీలన్నీ ఎత్తేశాడు. దీనికితోడు కొత్తగా మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నాడు అని హెచ్చరించారు.