అమరావతి(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగంలో మెరుగైన విద్యా ప్రమాణాలు, ర్యాంకింగ్స్ మెరుగుదల, సంస్కరణల అమలుకు తమవంతు సహాయ, సహాకారాలు అందిస్తామని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి చెప్పారు. ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ను ప్రొఫెసర్ చౌదరి మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని యూనివర్సిటీల పనితీరు మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయనతో లోకేష్ చర్చించారు. రీసెర్చి, ఇన్నొవేషన్స్‌లో వెనుకబడి ఉండటమే ఏపీలో ర్యాంకింగ్స్ తగ్గుదలకు కారణమని, వీటిని మెరుగుపరిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ప్రొఫెసర్ చౌదరి పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తేవడానికి అవసరమైన పాఠ్యాంశాల మార్పులు, ఇతర విధానాలను ఏపీ వర్సిటీలతో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. దీనిద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ యూనివర్సిటీలకు మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యారంగ నిపుణులు, విద్యార్థులు తమ యూనివర్సిటీని సందర్శించి సింగపూర్‌లో అవలంబిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలని చౌదరి ఆహ్వానించారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ… రాష్ట్రంలో యూనివర్సిటీల ర్యాంకింగ్ మెరుగుదలకు యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సహాయ, సహకారాలు తీసుకుంటామని చెప్పారు. ప్రొఫెసర్ చౌదరి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో స్ట్రాటజిక్ ఇండియా అండ్ ఇనిషియేటివ్స్ విభాగానికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.