అమరావతి: తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతో బిసి లకు అధికారంలో సముచితమైన వాటా లభించిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బిసి విభాగం లోగో ను అధినేత చంద్రబాబునాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నెముక అని అన్నారు. బిసిలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అండతోనే రాష్ట్రంలో తిరిగి అధికారపగ్గాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర బీసీ విభాగం కన్వీనర్ల సమావేశం కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, 2024 ఎన్నికల్లో బిసిలంతా తెలుగుదేశం పార్టీ వెంటే నిలవాలని కోరారు.
చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసే వరకు రాష్ట్రంలోని బి.సిలంతా ఐకమత్యంగా పని చేయాలన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావడానికి బిసి విభాగం నిర్వహించాల్సిన పాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, హెచ్‌ఆర్‌డి విభాగం చైర్మన్ రామాంజ నీయులు, సభ్యుడు ఎస్‌పి సాహెబ్, పార్టీ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కన్వీనర్ కొప్పాడి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆంధ్రప్రదేశ్ శిష్టకర్ణాలు సాధికారిక కన్వీనర్ అక్కు మహంతి రాజా, రాష్ట్రంలోని వివిధ జిల్లాల బిసి విభాగం కన్వీనర్లు, 50 బిసి కులాల ముఖ్యనేతలు పాల్గొన్నారు.