- కార్యకర్తల కుటుంబాలకు భువనమ్మ పరామర్శ
- కడప, డోన్, పాణ్యం నియోజకవర్గాల్లో నిజం గెలవాలి
- ఐదు కుటుంబాలకు పరామర్శ
కడప, డోన్, పాణ్యం(చైతన్యరథం): పార్టీ కష్టకాలంలో కార్యకర్తలే ప్రాణాలొడ్డి నిలబడి కాపాడుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా పార్టీ మీద అభిమానంతో అధికార వైసీపీ నేతల దాడులు, దాష్టీకాలు తట్టుకుని పార్టీని నిలబెట్టారన్నారు. అలాంటి కార్యకర్తల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవటం తమ బాధ్యత అన్నారు. వారి కన్నీరు తుడిచేందుకు ఎంత దూరమైనా వెళతా మన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గురువారం కడప, డోన్, పాణ్యం నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఆర్థికసాయం పత్రాలు అందచేసేందుకు నిజం గెలవాలి పేరు తో భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
కడప,డోన్,పాణ్యం నియో జకవర్గాల్లో ఐదుగురు కార్యకర్తల కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. మృతి చెందిన కార్యకర్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తనను చూసి భావోద్వే గానికి గురైన కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పర్యటన కోసం కడప విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుండి బయలుదేరిన భువనేశ్వరి కడప పట్టణం 44వ వార్డులో వరద చెండ్రాయుడు, ప్రొద్దుటూరు నియోజకవర్గం, ప్రొద్దుటూరు మండలం, పెదశెట్టిపల్లి గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 13న మృతిచెందిన కూరపాటి రాధ (39), డోన్ నియోజకవర్గం, బేతంచర్ల మండలం, హెచ్.కొట్టాల గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 15న మృతి చెందిన పువ్వాడి నాగేశ్వరరావు (60), అదే మండలం గొరుమానుకొండ గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 12న మృతి చెందిన తుపాకుల బాలవెంకటేశ్వర్లు (52), పాణ్యం నియోజకవర్గం, పాణ్యం మండలం, భూపనపాడు గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 24న మృతి చెందిన బొనిగేని శివరాముడు (56) కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు.